Share News

‘కూలిన’ జవాబుదారీతనం

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:06 AM

దక్షిణ ఢిల్లీలోని సత్యనికేతన్‌ ప్రాంతంలో ఐదు అంతస్థుల పెయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌ భవనం కుప్పకూలి, పలువురు విద్యార్థులు దుర్మరణం పాలవడం మనసులు కలచివేస్తున్నది.

‘కూలిన’ జవాబుదారీతనం

క్షిణ ఢిల్లీలోని సత్యనికేతన్‌ ప్రాంతంలో ఐదు అంతస్థుల పెయింగ్‌ గెస్ట్‌ హాస్టల్‌ భవనం కుప్పకూలి, పలువురు విద్యార్థులు దుర్మరణం పాలవడం మనసులు కలచివేస్తున్నది. యాభైయేళ్ళనాటి భవనానికి బేస్‌మెంట్‌లో కొన్ని మార్పుచేర్పులు చేపట్టడంతో అది పేకమేడలాగా కుప్పకూలింది. అప్పటికే వర్షాలకు తడిసిముద్దయి ఉన్న ఈ భవనం బేస్‌మెంట్‌లోకి నీరు కూడా చేరివున్న స్థితిలో, నిపుణుల పర్యవేక్షణ లేకుండా రిపేర్లు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని సహా పెద్దలంతా ఈ ప్రమాదం మీద కూడా ఆశ్చర్యాన్నీ, ఆవేదననూ ప్రకటించారు. బాధిత కుటుంబీలకు సానుభూతి తెలియచేశారు. ప్రమాదం జరిగిన తరువాత మనదేశంలో సకల వ్యవస్థలూ స్పందించే తీరు, వేగం ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది. ఏకంగా పదిపోలీసు బృందాలు, మూడు రాష్ట్రాలను జల్లెడపట్టి, రాజస్థాన్‌లో దాక్కున్న ఈ భవనం యజమానిని ఢిల్లీ లాక్కొచ్చాయి. ఆయన సహా కొందరు కుటుంబీలను సైతం అరెస్టుచేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందిస్తూ మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. సౌత్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ సహా ఐదుగురు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఎంసీడీ) అధికారులు సస్పెండ్‌ అయ్యారు. అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలపై ఇకపై ‘జీరో టాలరెన్స్‌’ విధానం అమలవుతుందట. అంతేనా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండేందుకు ఢిల్లీలోని అన్ని ప్రైవేటు పీజీ భవనాలకు స్ట్రక్చరల్‌ ఆడిట్‌ తప్పనిసరి చేస్తున్నట్లు కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. హాస్టల్‌ భవనాల నిర్మాణవేగాన్ని పెంచవలసిందిగా తమ అనుబంధ కళాశాలలకు ఢిల్లీ యూనివర్సిటీ వీసీ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ప్రమాదఘటనపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతూ, నగరంలోని అన్ని ప్రైవేటు పీజీ భవనాల్లో విద్యార్థుల భద్రత మీద వారంలోగా నివేదిక ఇవ్వాలని కేంద్రానికీ, ఢిల్లీ ప్రభుత్వానికీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా బీజేపీ అధీనంలోనే ఉన్నందున ఈ ఘటనను ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారు వైఫల్యంగా కాంగ్రెస్‌ అభివర్ణిస్తోంది. ఢిల్లీ పీజీ హాస్టల్‌ వ్యాపారం అంతా బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల అధీనంలో నడుస్తోందని ఆప్‌ విమర్శిస్తోంది.


ఇటువంటి ఘోరాలు జరగ్గానే వ్యక్తులు, వ్యవస్థలు ఎలా ఉలిక్కిపడతాయో గతంలోనూ చూసిందే. ఎంతటివారినైనా వదిలేది లేదని నాయకులు హామీ ఇవ్వడం నుంచి, న్యాయస్థానాలు వాపోవడం వరకూ అంతా వింటున్నదీ కంటున్నదే. ఢిల్లీ ‘ప్రమాదాల’ జాబితాలోకి ఇప్పుడు సత్యనికేతన్‌ ఘటన కొత్తగా వచ్చిచేరింది అంతే. దీనికిముందు ఒక హాస్టల్‌ భవనం మునిగిపోవడం నుంచి, ఒక గెస్ట్‌హౌస్‌ తగలబడిపోవడం వరకూ అనేకం చూశాం. ఆరు గదులకు అనుమతి తీసుకొని, పాతిక గదుల్లో జనాన్ని నింపి, బేస్‌మెంట్లో రెస్టారెంట్‌ నిర్వహించిన కారణంగా, ఆ ఐదంతస్తుల భవనం అగ్నికి ఆహుతై విదేశీయులతో సహా పలువురు విద్యార్థులు సైతం ప్రాణాలు పొగొట్టుకున్న మాలవీయనగర్‌ విషాదం మూడునెలల క్రితమే జరిగింది. దానికి సరిగ్గా మూడురోజుల ముందే, దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని భవనం కూలి పలువురు విద్యార్థులు మరణించారు. వీరంతా పొరుగున ఉన్న కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతూ ఈ హాస్టల్‌లో ఉంటున్నవారు. రాకపోకలకు ఒకేమార్గం ఉన్న ఈ భవనం ఎత్తును అక్రమంగా పెంచుతున్నారని విద్యార్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఒకపక్క పైన బరువు పెంచి, మరోవైపు బేస్‌మెంట్‌లో సంప్‌ విస్తరణకోసం జరిపిన తవ్వకాలు దాని పునాదినే బలహీనపరచాయి. ఢిల్లీలో గత మూడేళ్ళలో వెయ్యికి పైగా భవనాలు వివిధ కారణాలవల్ల కూలినట్టు నివేదికలు చెబుతున్నాయి. విషాదం జరిగిన ప్రతీసారి ప్రభుత్వం ఏవో చర్యలు ప్రకటిస్తుంది, ఎవరినీ క్షమించేది లేదని, రక్షించేది ఉండదని అంటుంది. భద్రమైన భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తుంది. కానీ, మరో విషాదం జరిగేవరకూ ఊపిరిబిగబట్టి ఎదురుచూడటం వినా జనం చేయగలిగిందేమీ లేకపోతోంది. భద్రంగా లేని భవనాలు, అక్రమ నిర్మాణాలు, చట్టవిరుద్ధ వ్యాపారాలతో ఢిల్లీ ఒక్కటే కాదు, దేశంలోని నగరాలన్నీ వెలుగుతున్నాయి. దీనిని పర్యవేక్షణ లోపంగా చూడటం కంటే, మొత్తం నియంత్రణ వ్యవస్థ కుప్పకూలిందనడం సమంజసం. అవినీతి ఆకాశాన్ని అంటుతున్నదని, జవాబుదారీతనం మటుమాయమైందనీ ఈ విషాద ఘటనలు తెలియచెబుతాయి.

Updated Date - Sep 08 , 2026 | 12:07 AM