Share News

మద్యం రవాణా టెండర్ల కేసులో కసిరెడ్డి బృందానికి హైకోర్టు షాక్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:23 AM

మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో పలువురు నిందితులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), తూకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి(ఏ3), కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(ఏ4) దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను సోమవారం కొట్టివేసింది.

మద్యం రవాణా టెండర్ల కేసులో కసిరెడ్డి బృందానికి హైకోర్టు షాక్‌

  • వారు నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయ్‌

  • ముందస్తు బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం: న్యాయమూర్తి

  • కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల పిటిషన్లు కొట్టివేత

అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నమోదైన కేసులో పలువురు నిందితులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి(ఏ1), తూకేకుల ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి(ఏ3), కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(ఏ4) దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను సోమవారం కొట్టివేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. ముందస్తు అనుమతి లేకుండా జిల్లాస్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రస్థాయి టెండర్ల వ్యవస్థను తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని గుర్తుచేసింది. బినామీ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినప్పుడు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని తెలిపింది. తీవ్ర ఆర్థిక నేరాలు, ప్రజాధనం దుర్వినియోగం కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని గుర్తుచేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఈ దశలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేమని పేర్కొంది. ముందస్తు బెయిల్‌ మంజూరుకు పిటిషనర్లు లేవనెత్తిన కారణాలు సరైనవి కాదంటూ.. రాజకీయ ప్రతీకారంతో కేసులు పెట్టారన్న వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గంధం సునీత సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లచ్చప్ప మాస్టారు..

Updated Date - Sep 08 , 2026 | 06:23 AM