Share News

పీసీబీ నాకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాలి: పాక్ మాజీ కోచ్ గెలెస్పీ

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:05 PM

పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం ముదరుతున్న వేళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిలెస్పీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు.

పీసీబీ నాకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాలి: పాక్ మాజీ కోచ్ గెలెస్పీ
Jason Gillespie

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం ముదరుతున్న వేళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిలెస్పీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు. బోర్డు తనకు ఇంకా వేల డాలర్ల బకాయి చెల్లించాల్సి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పీసీబీలో తనకు సరైన గౌరవం దక్కలేదని, బాధ్యతలను క్రమంగా తగ్గిస్తూ చివరకు జట్టులో తన పాత్రే లేకుండా చేశారని వాపోయాడు. చీఫ్ సెలెక్టర్ ఆఖిబ్ జావెద్‌తో ఉన్న వివాదం గురించి కూడా గెలెస్పీ బహిర్గతం చేశాడు.


‘ఆఖిబ్‌ జావెద్‌ నియామకం పాకిస్థాన్‌ క్రికెట్‌ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆయన‌ వచ్చి అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రతి విషయంలో ఆయనే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా నాకు అనిపించింది. మొదట టెస్ట్‌ జట్టును చూసుకోవడం, ఆటగాళ్లు, సిబ్బందిని నిర్వహించడం, సెలెక్షన్‌లో భాగస్వామ్యం కావడం నా బాధ్యతల్లో ఉండేవి. చివరకు ఏ విషయంలోనూ నాకు పాత్ర లేకుండా పోయింది. ఇవన్నీ నన్ను పూర్తిగా కుంగదీశాయి. కోచింగ్‌పైనే ఆసక్తి తగ్గిపోయింది. మానసికంగా ప్రభావితమయ్యాను. నన్ను నేను అనుమానించుకునే పరిస్థితి వచ్చింది. అసలు ఇక ఈ క్రీడలో కొనసాగాలా? వద్దా? అని ఆలోచించే స్థితికి వెళ్లాను’ అని వెల్లడించాడు.


వేల డాలర్ల బకాయి..

‘పీసీబీ నాకు ఇంకా వేల డాలర్లు బకాయి ఉంది. నేను నోరు మూసుకుని అన్నింటికీ అంగీకరించి జీతం తీసుకుంటూ ఉండేవాడిని. కానీ అది నా స్వభావం కాదు. మరో రెండు నెలల్లో నన్ను ఎలాగైనా తొలగిస్తారని నాకు అప్పుడే అనిపించింది. తెర వెనుక ఆఖిబ్‌ నా గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నాడని పాకిస్థాన్‌ క్రికెట్‌లోని కొందరు నాకు చెప్పారు. ఆయన అలా వ్యవహరించడం నాకు తెలుసు. ఆఖిబ్ సహా పీసీబీలో అధికారులు నన్ను అవమానించారు, నా పాత్రను బలహీనపరిచారు. దీనికి నేను నేరుగా ఆఖిబ్‌ జావెద్‌నే బాధ్యుడిగా చెబుతున్నాను. మా తొలి సమావేశంలోనే ఆయన తనే బాస్‌ అన్నట్టుగా వ్యవహరించాడు. ఏం చేయాలో ఆయనే చెబుతుండేవాడు. మొదట నేను విని సరే అన్నాను. కానీ ఇది పదేపదే జరుగుతూ వచ్చింది. కొన్ని విషయాల్లో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. అప్పటికే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నిర్ణయించుకున్నాడని నాకు అర్థమైంది. కలిసి పనిచేసే అవకాశం లేదని అప్పుడే అనిపించింది’ అని గెలెస్పీ తెలిపాడు.


ఛైర్మన్ అండతోనే..

‘ఆఖిబ్‌కు పీసీబీ ఛైర్మన్‌, బోర్డు మద్దతు ఉంది. అందుకే తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో వ్యవహరించాడు. అతడు ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకునే సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ కాదు. అలాంటి వాతావరణంలో నేను పని చేయాలనుకోలేదు. ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌లో జరుగుతున్నది చూస్తుంటే బాధగా ఉంది. పాక్ క్రికెట్ అసలు సమస్య ఆఖిబ్‌ జావెద్‌. ఆయన అక్కడ ఉన్నంతకాలం పాకిస్థాన్‌ క్రికెట్ అభివృద్ధి చెందదు. బోర్డులో ఉన్న ఛైర్మన్లు, అధికారులు కెప్టెన్‌ను ఎంపిక చేయడం అర్థరహితం. సరైన కోచ్‌ను నియమించాలి. అతడికి కొంత సమయం ఇవ్వాలి. పరిస్థితులు కుదుటపడిన తర్వాత కోచ్‌నే కెప్టెన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. అక్కడి నుంచి పాకిస్థాన్‌ క్రికెట్‌ను పునర్నిర్మించాలి. ప్రస్తుతం మాత్రం జట్టు ఎటూ ముందుకు వెళ్లడం లేదు’ అని గెలెస్పీ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 08 , 2026 | 02:05 PM