అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:38 AM
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ మేరకు బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు సుందర్ అందుబాటులో ఉండనున్నాడు. అయితే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సహా మరో ఇద్దరు ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20కి మరో నాలుగు రోజులే ఉన్నప్పటికీ బుమ్రా ఇంకా మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేయలేదు. సెప్టెంబరు 9న అతడు ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అది పూర్తయ్యాకే బుమ్రాను సిరీస్‌కు పంపించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్‌పైనా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇద్దరూ ఇప్పటికే ఫిట్‌నెస్ టెస్టులు, మ్యాచ్ సిమ్యులేషన్ పూర్తి చేశారు. అయినప్పటికీ వారిని ఇంకా పూర్తిగా ఫిట్‌గా ప్రకటించలేదు. సెప్టెంబరు 9 సాయంత్రానికి తుది ఫిట్‌నెస్ నివేదిక వెలువడే అవకాశం ఉంది.
వరుస ఓటములతో..
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో కలిపి భారత్ వరుసగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు సెలెక్టర్లు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశారు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మాత్రం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్‌లో గాయపడిన అతడు.. కాలి కండరాల సమస్య నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడతారని చెప్పడం తొందరపాటు: ఆశిష్ నెహ్రా
బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి.. రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డా: ఇషాన్ కిషన్