Share News

బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి.. రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డా: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:01 AM

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ఇషాన్.. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఇషాన్ తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి.. రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడ్డా: ఇషాన్ కిషన్
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: ఇషాన్ కిషన్.. ఒకప్పుడు టీమిండియా మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడు. ఆ తర్వాత ఊహించని పరిణామాలతో జట్టుకు దూరమయ్యాడు.. చివరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకుని.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో కఠోరంగా శ్రమించాడు. తన ఆటను తిరిగి గాడిలో పెట్టుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ఇషాన్.. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఇషాన్ తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


‘బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి జట్టుకు దూరమైనప్పుడు ఒక విషయం అర్థమైంది. ఒక ప్లేయర్‌గా మనం చేయాల్సిన పని ఒక్కటే.. పరుగులు చేయడం. మిగతా ఆలోచనలన్నీ మన మైండ్‌సెట్‌ను ప్రభావితం చేస్తాయి. అనవసర ఒత్తిడిని పెంచుతాయి. అందుకే వాటిని పక్కన పెట్టా. ప్రస్తుతం నేను చేస్తున్న మంచి పని ఏంటంటే.. ఏదీ ఎక్కువగా ఆలోచించకపోవడం. బ్యాటర్‌గా నా పని బంతిని చూడటం, దానికి స్పందించడం. నా నుంచి నేను ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోవడం. అప్పుడప్పుడూ సహనం కోల్పోతాం. అలాంటి సమయంలో మనతో మనమే మాట్లాడుకోవాలి. ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకుని.. ఆ తర్వాత ప్రణాళికను అమలు చేయాలి’ అని ఇషాన్‌ వివరించాడు.


జీరో నుంచి మొదలు

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం, పెద్దగా అభిమానుల సందడి లేకపోవడం తనకు ఇబ్బందిగా అనిపించలేదని ఇషాన్‌ చెప్పాడు. పైగా ఆ సమయం తన ఆటను విశ్లేషించుకునేందుకు ఉపయోగపడిందన్నాడు. ‘నిజంగా నేను ఆ అనుభవాన్ని ఆస్వాదించాను. దాదాపు రెండేళ్లు వెనక్కి వెళ్లి కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. భారత జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్లిపోతాం. ఎంత మంచి ప్లేయర్ అయినా ఒక దశలో ఎదుగుదల ఆగిపోవచ్చు. అలాంటి సమయంలో ఒక్క అడుగు వెనక్కి వేసి దేశవాళీ క్రికెట్‌కు వస్తే మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టినట్టే. ఇప్పుడు ఎంతోమంది పరుగులు చేస్తున్నారు. జట్టులోకి తిరిగి రావాలంటే వారికంటే మెరుగ్గా ఆడటం తప్ప మరో మార్గం లేదు. అందుకే మళ్లీ జీరో నుంచి ప్రారంభించాలి. గతంలో ఏం మిస్‌ అయ్యాం? ఎందుకు వచ్చిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయాం? అనే విషయాలను ఆలోచించేందుకు దేశవాళీ క్రికెట్‌ సమయం ఇస్తుంది. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పేమీ ఉండదు. కాలంతో పాటు మారేది మన మైండ్‌సెట్‌ మాత్రమే’ అని ఇషాన్‌ వెల్లడించాడు.


సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక 2025-26 రంజీ ట్రోఫీలో సెంచరీలు సాధించిన ఇషాన్‌.. అదే సీజన్‌లో జార్ఖండ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 517 పరుగులు చేయడంతో పాటు రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆ తర్వాత అనూహ్యంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.


ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 09:01 AM