కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!
ABN , Publish Date - Sep 06 , 2026 | 01:01 PM
భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తోన్న తమిళనాడు స్పిన్నర్ సాయి కిశోర్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లాస్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న కిశోర్.. అదిరిపోయే ప్రదర్శన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తోన్న తమిళనాడు స్పిన్నర్ సాయి కిశోర్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లాస్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న కిశోర్.. అదిరిపోయే ప్రదర్శన చేశాడు. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 పరుగులిచ్చి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. తన సూపర్ స్పెల్‌తో టీమిండియా సెలెక్టర్లకు మరోసారి సవాల్ విసిరాడు.
రెడ్ బాల్ క్రికెట్‌లో సాయి కిశోర్‌కు మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్న అతడు.. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోనూ వరుసగా ప్రభావం చూపిస్తున్నాడు. అయినా భారత టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. కౌంటీ క్రికెట్‌లో ఇలాంటి ప్రదర్శనలతో టెస్టు క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని సాయి కిశోర్ మరోసారి సెలెక్టర్లకు పంపాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలే.
గంభీర్ ఆలోచనల్లో సాయి కిశోర్?
భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీతో పాటు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనూ వరుసగా తనను తాను నిరూపించుకుంటున్న ఈ తమిళనాడు స్పిన్నర్.. ఇకనైనా సెలెక్టర్ల దృష్టిలో పడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!
ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?