Share News

బిట్టు ఓ హీరో.. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి: కెవిన్ పీటర్సన్

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:10 PM

మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి బిట్టి తబాహీ స్వయంగా వెళ్లి ఓ నదిని శుభ్రం చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు.

బిట్టు ఓ హీరో.. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి: కెవిన్ పీటర్సన్
Kevin Pietersen

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ యువకుడి కథ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను ఆకట్టుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి బిట్టి తబాహీ స్వయంగా వెళ్లి ఓ నదిని శుభ్రం చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడిపై పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. బిట్టు కాలుష్యంపై యుద్ధం చేస్తున్నాడని అన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘ఉదయం బిట్టు కథ చదివాను. మీతో ఆ విషయాన్ని పంచుకోవాలని అనిపించింది. 21 ఏళ్ల బిట్టు తబాహీ కలుషితమైన నదిలోకి దిగి శుభ్రం చేయడం ప్రారంభించాడు. గ్లౌజులు, బూట్లు ఏవీ ధరించలేదు. అతడికి కనీసం ఈత కొట్టడం కూడా రాదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బియోరాలో ఓ ఆలయం సమీపంలో ఉన్న నదిని శుభ్రం చేశాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను తొలగించడంతో పాటు పూజ సామగ్రి వ్యర్థాలను కంపోస్టుగా మార్చేందుకు బిట్టు ప్రయత్నించాడు. స్నేహితులతో కలిసి డబ్బులు సమకూర్చుకుని పనిముట్లు, చెత్త బుట్టలు కొనుగోలు చేశాడు. వీటి కోసం అతడు సుమారు రూ.30వేల సొంత డబ్బును ఖర్చు చేశాడు. ఒక దశలో చేతులకు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చాయి. అయినా అతడు వెనక్కి తగ్గలేదు’ అని పీటర్సన్ వివరించాడు.


తబాహీ అంటే విధ్వంసం..

‘బిట్టు ఇంటి పేరు తబాహీ. అంటే విధ్వంసం అని అర్థం. ఇప్పుడు అతడు కాలుష్యంపై యుద్ధం చేస్తున్నాడు. ఎవరో వచ్చి చేస్తారు అని వదిలేసినప్పుడు ఏది జరగదు. మార్పు అనేది ఒకరి కోసం ఎదురుచూడకుండా స్వయంగా బరిలోకి దిగితేనే వస్తుంది. నా దృష్టిలో బిట్టు ఓ హీరో. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి’ అని పీటర్సన్ వెల్లడించాడు.


ఎవరీ బిట్టు తబాహీ?

బిట్టు తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్‌ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా బియోరాకు చెందిన బీఎస్సీ విద్యార్థి. పర్యావరణ పరిరక్షణపై ఆసక్తితో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ క్రమంలోనే బియోరాలోని ఓ ఆలయం సమీపంలో అజ్నార్‌ నదిలో భారీగా ప్లాస్టిక్‌, నాచు, బురద పేరుకుపోయి.. దుర్వాసన వస్తుండటాన్ని చూసి.. అధికారుల కోసం ఎదురుచూడకుండా నదిలోకి దిగి తానే శుభ్రం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఇవి కూడా చదవండి:

షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!

ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?

Updated Date - Sep 06 , 2026 | 12:10 PM