Share News

రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడతారని చెప్పడం తొందరపాటు: ఆశిష్ నెహ్రా

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:53 AM

వన్డే ప్రపంచ కప్‌లో రో-కోకు అవకాశం దక్కుతుందా? అనే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రపంచ కప్‌లో రో-కో ఆడుతారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటేనని వెల్లడించాడు.

రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడతారని చెప్పడం తొందరపాటు: ఆశిష్ నెహ్రా
Ashish Nehra

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రానున్న 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా ఈ ఇద్దరూ శ్రమిస్తున్నారు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ యువ ప్లేయర్ల వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. జట్టులో రో-కోకు అవకాశం దక్కుతుందా? అనేది ప్రస్తుత చర్చ. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రపంచ కప్‌లో రో-కో ఆడుతారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటేనని వెల్లడించాడు.


‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే వన్డే జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. వారి ప్రస్తుత ఫామ్, రాబోయే రోజుల్లో ప్రదర్శన బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది. వన్డే ప్రపంచ కప్ 2027కు ఇంకా 13 నెలల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయం. విరాట్, రోహిత్ ప్రపంచ కప్‌లో ఆడుతారని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. 13 నెలల సమయంలో ఏదైనా జరగొచ్చు. భారత క్రికెట్‌లోనే కాదు.. ఏ క్రీడలోనైనా చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోతుంటాయి. వాళ్లు బాగా ఆడుతూ, మంచి ప్రదర్శనలు ఇస్తుంటే జట్టులో ఎందుకు ఉండకూడదు? అయితే ఈ ఆటగాళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవడం ఏ కోచ్, కెప్టెన్‌కైనా అంత సులభం కాదు. వాళ్లు గతంలో ఏం సాధించారో మనందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రో-కో విషయంలో వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. అందుకే నేను ఎలాంటి కచ్చితమైన అంచనాకు రావడం లేదు’ అని నెహ్రా స్పష్టం చేశాడు.


ఏదీ శాశ్వతం కాదు..

భారత జట్టులో ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌, జస్ప్రీత్‌ బుమ్రా వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ఫార్మాట్‌ను బట్టి పరిస్థితులు మారుతుంటాయని నెహ్రా పేర్కొన్నాడు. ‘మనం శుభ్‌మన్‌ గిల్‌, బుమ్రాపై భారీ అంచనాలు పెట్టుకుంటూ ఉంటాం. వన్డే, టెస్టు క్రికెట్‌కు కెప్టెన్ అయిన గిల్.. పొట్టి ఫార్మాట్‌లో జట్టులోనే లేడు. బుమ్రా కూడా వికెట్లు తీయడానికి శ్రమిస్తుంటాడు. ఏదీ శాశ్వతం కాదు. అందుకే క్రికెట్‌లో భవిష్యత్తును ఇప్పుడే అంచనా వేయడం చాలా కష్టం’ అని నెహ్రా వివరించాడు. ఇదిలా ఉంటే, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తదుపరి వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. సెప్టెంబరు 27 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శనపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 10:01 AM