Share News

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Jan 23 , 2026 | 07:17 PM

దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.

వారు దేశం విడిచి వెళ్లిపోతేనే మంచిది: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu

విజయవాడ, జనవరి23(ఆంధ్రజ్యోతి): దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 25 ఏళ్లు అయిన సందర్భంగా స్మరణ, నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మాజీ డీజీపీ మాలకొండయ్య పాల్గొన్నారు.


అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. సమాజాన్ని చెడగొట్టేలా ఉగ్రవాద ప్రసంగాలు చెబితే.. వారు ప్రజా ద్రోహులేనని విమర్శలు చేశారు. దేశభక్తి అంటే.. ఎవడి పని వాడు చేస్తే చాలని చెప్పానని ప్రస్తావించారు. దేశంలో కష్టపడి పని చేసేవారి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. తెలివి తేటలతో బాగా పని చేస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన విధంగా 2047 నాటికి దేశం ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంటుందని వెల్లడించారు. సత్య నాదెళ్ల వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎంచుకున్న పనుల్లో ఎదిగేలా యువత కష్టపడి పని చేయాలని దిశానిర్దేశం చేశారు.


ప్రపంచ దేశాల ఆశ్చర్యం..

‘అంతరిక్ష యానంలో ఇస్రో చేసిన కృషికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని వెంకయ్యనాయుడు వెల్లడించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మన యువత ఎప్పుడూ పాజిటీవ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. నెగిటీవ్ ఆలోచనలు మంచిది కాదు.. అది మనల్నే ముంచేస్తుంది. మన రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చింది. యువతరం ఈ రెండింటినీ గుర్తించి ముందుకు వెళ్లాలి. జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న మహిళా వైద్యురాలు రెసిన్ అనే ప్రాణాంతక విషం తయారు చేసి ప్రసాదాల్లో కలపాలని కుట్ర చేశారు. దీనిని ముందే గుర్తించి అధికారులు వారి కుట్రలను భగ్నం చేశారు. ఉగ్రవాదుల మాయలో పడి జీవితాలు నాశనం అవుతాయనేందుకు ఆ డాక్టర్ ఉదంతమే ఉదాహరణ.అందుకే ఎవరి పని వారు సక్రమంగా, బాధ్యతగా చేయాలని చెబుతున్నాను. పార్లమెంట్‌పై దాడిలో అమరజీవులైన వారు సామాన్య పోలీసులు. పార్లమెంట్‌లో ఉన్న ప్రధాన నాయకులను కాపాడేందుకు వారి ప్రాణాలు కోల్పోయారు. 2001 డిసెంబర్ 13వ తేదీన చలికాల సమావేశాల సమయంలో ఈ దాడి జరిగింది’ అని తెలిపారు.


దాడులను ప్రేరేపించేది మన పొరుగు దేశమే..

ఆరోజు నేను కార్యాలయంలోనే ఉన్నాను.. సభ వాయిదా పడిన కాసేపటికే పెద్ద శబ్దాలు వచ్చాయని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ‘హోంమంత్రిగా ఉన్న ఎల్కే అద్వానీ దగ్గరకు వెళితే ఉగ్రవాదుల దాడి విషయం చెప్పారు. భారత రక్షణ దళం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆరోజు కమలేశ్ కుమారి అనే ఆమె ఉగ్రవాదుల దాడిని గుర్తించి ఎదురు తిరిగింది. ఆమె హెచ్చరికలు చేయడం వల్లే.. అందరూ అలర్ట్ అయ్యారు. ఉగ్రవాదులను తయారు చేసి దాడులను ప్రేరేపించేది మన పొరుగు దేశమే. నక్సలైట్ల మౌలిక సిద్దాంతమే తప్పు.. ప్రజా స్వామ్యంలో తుపాకీ గొట్టం ద్వారా అధికారం రాదు. నువ్వు తుపాకీ కాలిస్తే.. రేపు నిన్ను కాల్చి ఇంకొకరు అధికారంలోకి వస్తారు. అందుకే తుపాకీ గొట్టం కన్నా.. ప్రజాస్వామ్యం బద్దంగా వేసే ఓటే పెద్ద ఆయుధం. ఇందిరాగాందీ ఎమర్జెన్సీ తర్వాత బ్యాలెట్ ద్వారానే ఆమెను ప్రజలు ఓడించారు. ప్రజాప్రతినిధులు.. బాధ్యత మరచి అమ్మలను, అక్కల గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. అటువంటి భాషను చూసి చాలా మంది మహిళలు అసహ్యించుకుంటున్నారు. ఇలా అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ స్టేషన్లలోనే సమాధానం చెప్పాలని నేను గతంలో అన్నాను’ అని వెంకయ్యనాయుడు వెల్లడించారు.


నేను రాజకీయాలకు దూరం..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసభ్యంగా మాట్లాడే వారు ఎవ్వరూ గెలవలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ఉప రాష్ట్రపతి పదవి తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. పక్కనే నాకు ఇష్టమైన జన సంఘ్ సమావేశం జరుగుతున్నా.. నేను వెళ్లడం లేదు. కొంతమంది సెల్‌ఫోన్లు ఆన్ చేయడం వచ్చు కానీ.. ఆఫ్ చేయడం రావట్లేదు. ముఖ్యమైన సమావేశాల్లోనూ, పెద్దలను కలిసే సమయంలోనూ మొబైల్ ఫోన్లు సైలెంట్‌గా పెట్టుకోవడం సంస్కారం.. ఇది అందరూ తెలుసుకోవాలి. నేడు ఫోన్ లేని వారు ఎవ్వరూ లేరు.. కొందరికీ రెండు, మూడు ఫోన్లు కూడా ఉన్నాయి. పార్టీలో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అనేక బాధ్యతలు స్వీకరించాను. మన ప్రజాస్వామ్య దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు పొరుగు దేశం కుట్రలు చేస్తూనే ఉంది. ఆనాడు కొంతమంది తమ స్వార్థం కోసం ముస్లింలు, హిందువులు కలిసి ఉండలేరనే ప్రచారం చేశారు. అందుకే పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్లిపోయారు. కానీ ఇండియాలోనే చాలా మంది ముస్లింలు మన దేశంలోనే ఉండిపోయారు. వారంతా మన సోదరులే.. మనమంతా కలిసి మన దేశం కోసం పని చేయాలి’ అని వెంకయ్యనాయుడు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 07:28 PM