ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:16 PM
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
విజయవాడ, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Case) విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది? నిధుల మళ్లింపు ఎలా జరిగింది.? అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
నిందితుల కస్టడీ వివరాలివే..
విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు ప్రధాన నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.
రోనక్ కుమార్: రోనక్ కుమార్‌ను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోనక్ కుమార్‌ను సిట్ కార్యాలయానికి తరలించి, ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. మద్యం సరఫరా, లైసెన్సుల మంజూరులో జరిగిన అవకతవకలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది.
అనిల్ చోక్రా: అనిల్ చోక్రాను ఒక రోజు పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా అనిల్ చోక్రాను విజయవాడ జిల్లా జైల్లోనే విచారించాలని నిర్ణయించారు.
తాజా సమాచారం ప్రకారం.. సిట్ అధికారులు ఇప్పటికే విజయవాడ జిల్లా జైలుకు చేరుకుని అనిల్ చోక్రాను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. లిక్కర్ పాలసీలో జరిగిన లోపాలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాల గురించి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు.. గుంటూరు జైల్లో ఉన్న మరికొంత మంది రిమాండ్ ఖైదీల గురించి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసు నేపథ్యమిదే..
జగన్ హయాంలో మద్యం అమ్మకాలు, కంపెనీలకు చెల్లింపులు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించిన లావాదేవీల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. నాణ్యత లేని మద్యం సరఫరా చేసిన కంపెనీలకు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? అనే విషయంపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల్లో కేవలం నగదు(Cash) రూపంలోనే లావాదేవీలు జరగడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అని నిందితులను నిలదీస్తున్నారు. మద్యం వ్యాపారంలో రాజకీయ నాయకులు, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉంది? అని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా.. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కీలక రాజకీయ నాయకులకు ఈ కేసుతో ఉన్న లింకులను ఛేదించేందుకు.. పక్కా ప్రణాళికతో సిట్ ముందడగు వేస్తున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో సిట్ కస్టడీ విచారణ పూర్తి కాగానే.. సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. ఈ స్కామ్ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం చేకూరింది? అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ కేసు.. సుప్రీం కోర్టులో నిందితులకు ఎదురుదెబ్బ
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..
For More AP News And Telugu News