తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 07:34 AM
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..
తూర్పు గోదావరి, జనవరి21 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (East Godavari District Road Accident) చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
విద్యార్థుల వివరాలిలా..
హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి గ్రామంలో ఉన్న మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. ఈ టూర్‌లో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులతో కలిపి మొత్తం 80 మంది విద్యార్థులు (40 మంది బాలికలు, 40 మంది బాలురు) 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. రెండు బస్సుల్లో ప్రయాణిస్తూ అరకు, పాడేరు తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
తిరుగు ప్రయాణంలో ప్రమాదం..
విహారయాత్ర పూర్తయిన అనంతరం విద్యార్థులు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవరం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదానికి కారణం ఏమిటి?
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఒక ట్రావెల్ బస్సు ముందు వెళ్తుండగా అకస్మాత్తుగా గేదె రోడ్డుపైకి వచ్చింది. గేదెను తప్పించేందుకు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న విద్యార్థుల బస్సులు, మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి .ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విద్యార్థులకు గాయాలు..
ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరికొందరికి చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 26 మంది విద్యార్థులను మూడు అంబులెన్స్‌లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
మిగిలిన విద్యార్థుల భద్రత:
మిగతా విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించి సురక్షితంగా ఉంచారు. అక్కడ వారికి ఆహారం, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పాఠశాల యాజమాన్యం, అధికారులు వారికి సమాచారం అందిస్తూ పరిస్థితిని వివరించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్లను విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News