వైసీపీ-సీజేపీ బంధంపై మాధవ్ విమర్శలు.. జగన్తో చేతులు కలపడంపై ప్రశ్నలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:41 PM
వైసీపీ-సీజేపీ బంధంపై బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్తో సీజేపీ చేతులు కలిపారంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబర్ 15: వైసీపీ-సీజేపీ బంధంపై బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్తో సీజేపీ చేతులు కలిపారంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ నినాదాలు చేసే సీజీపీ(CJP).. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న జగన్తో చేతులు కలపడంతో అసలు అజెండా స్పష్టమవుతోందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. నాడు మత విద్వేషంతో తన పాలనలో రాష్ట్రంలోని దేవాలయాల విధ్వంసం, రథ దగ్ధం, విగ్రహాల శిరచ్ఛేదాలను, దేవాలయాల ఆస్తుల ఆక్రమణలను, మత మార్పిడులను జగన్ ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. నేడు రాజకీయ లబ్ధి కోసం దేశ విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశాని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో ప్రతిపక్షాల హక్కులు, రాజకీయ స్వేచ్ఛకు ఎదురైన సవాళ్లను, ప్రజలు పడిన ఇబ్బందులను, అవినీతి ఆరోపణలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని మాధవ్ అన్నారు. శాంతియుత నిరసన ప్రజాస్వామ్య హక్కు అని... కానీ హింస, రాళ్లదాడులు, పోలీసులపై దాడులు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, భద్రతా సిబ్బందిపై దాడులకు ప్రజాస్వామ్యంలో చోటులేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే పోలీసుల చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం మాజీ సీఎంకు బాధ్యతాయుతమైన వైఖరి కాదని అన్నారు.
అవినీతి వ్యతిరేక పోరాటమని చెప్పుకునే CJP, అవినీతి కేసులను ఎదుర్కొంటున్న జగన్తో కలిసి పనిచేయడం వారి నినాదాలకు, ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టం చేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ అన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అస్థిరత, విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులతో కలిసి జగన్ సాగిస్తున్న రాజకీయ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని.. తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పును వెల్లడిస్తారని ఎక్స్లో మాధవ్ పోస్ట్ చేశారు.
వైసీపీ-సీజేపీ అనుబంధంపై ఆసక్తికర చర్చ..
మరోవైపు వైసీపీ-సీజేపీ అనుబంధంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీజేపీకి మద్దతనిస్తూ జగన్ చేసిన ట్వీట్, దానికి అభిజిత్ దీప్కే ధన్యవాదాలు తెలుపుతూ చేసిన పోస్టింగ్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్స్కు దారి తీసింది. ఏపీలో తాము కూడా కాక్రోచ్లమే అంటూ గతంలోనే జగన్ చేసిన కామెంట్లను పలువురు నేతలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఇక సీజేపీకి మద్దతుగా జగన్ చేసిన పోస్ట్ను స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసులున్నా పట్టించుకోకుండా కేంద్రానికి ఎదురెళ్తున్నారంటూ వైసీసీ కార్యకర్తలు సోషల్ మీడియా సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ వైపు జగన్ అడుగులు వేస్తే బాగుంటుందని వైసీపీ సానుభూతిపరులు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే జగన్ మీదున్న కేసులకు ముందుగా సమాధానం చెప్పాలంటూ మరికొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. జగన్ అవినీతిపరుడంటూ గతంలో సౌరవ్ దాస్ పెట్టిన పోస్టులను సోషల్ మీడియాలో నెటిజన్లు తిరిగి పోస్ట్ చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీని పెంచి పోషిస్తున్న వారసత్వ పార్టీల గుంపులో జగన్ కూడా చేరారంటూ కామెంట్లు చేస్తున్నారు. జగన్ కేసులు మీద నిన్న కోర్టు నిర్ణయం వెలువడగానే... కేంద్రాన్ని విమర్శిస్తూ పోస్టులు మొదలు పెట్టేశారంటూ సోషల్ మీడియాలో విశ్లేషణలు జరుగుతుండగా.. సీజేపీకి తెర వెనుక ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు
Read Latest AP News And Telugu News