ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:21 AM
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుందని ప్రయాణికులు తెలిపారు..
ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. బస్సు వెనుక నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమయ్యాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు అర్థం చేసుకున్న డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కకు ఆపి, అందులో ఉన్న ప్రయాణికులను తక్షణమే కిందకు దించాడు.
బస్సులో 39 మంది ప్రయాణికులు..
అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం..
డ్రైవర్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటిలోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. క్షణాల తేడాతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు.
ట్రాఫిక్‌కు అంతరాయం..
బస్సు దగ్ధమవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
అగ్నిప్రమాదానికి కారణం?
బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ లేదా వైర్లలో తలెత్తిన సాంకేతిక లోపమే అగ్నిప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News