బిరబిరా కృష్ణమ్మ
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:45 AM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి వరద ప్రవాహం రాష్ట్రంలోకి తరలివస్తోంది. కృష్ణమ్మ తరలి రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక ప్రారంభమవగా.. గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
జూరాల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం
లక్ష క్యూసెక్కుల నీరు రాక
గోదావరికీ భారీగా వరద.. భద్రాచలం వద్ద
29 అడుగులు.. నేడు తొలి ప్రమాద హెచ్చరిక
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి వరద ప్రవాహం రాష్ట్రంలోకి తరలివస్తోంది. కృష్ణమ్మ తరలి రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక ప్రారంభమవగా.. గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద చేరుతోంది. జూరాల క్రస్ట్ గేట్ల నుంచి 47,196 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,225 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇది క్రమంగా పెరిగి గురువారం రాత్రి సమయానికి శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కుల నీరు వస్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 827.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46.82 టీఎంసీలు ఉంది.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం నాటికి 513.10 అడుగులు ఉంది. ఇది 136.99 టీఎంసీలకు సమానం. 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 900 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 29.07 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. లీకుల ద్వారా 400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.
ఒక్క రోజులోనే 17 నుంచి 29 అడుగులకు గోదావరి
తెలంగాణ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పెరుగుతోంది. వాగులు, వంకలు, ఉపనదుల వరద గోదావరిలోకి చేరుతుండటంతో బుధవారం వరకు వేలేరుపాడు మండలంలో ఇసుక తిన్నెలతో కనిపించిన గోదావరి.. గురువారం వరద నీటితో నిండుకుండలా మారింది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 17 అడుగులు మాత్రమే ఉండగా.. గంట గంటకూ పెరుగుతూ గురువారం సాయంత్రానికి 29 అడుగులకు చేరింది. తెలంగాణలోని నిర్మల్, ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం భారీగానే నమోదవుతుండడంతో ఆ వరద మొత్తం గోదావరికే చేరుతోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి ఉపనది ఇంద్రావతి నుంచి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తుండడంతో శుక్రవారం ఉదయానికి తొలి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు)కి చేరనున్నట్టు నీటి పారుదల శాఖాధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 1,96,766 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు ఎస్‌ఈ రామచంద్రరావు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,080 క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News