Share News

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడుతున్నారు:కేశినేని నాని

ABN , Publish Date - Jun 04 , 2026 | 08:33 AM

తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై రాజకీయ ప్రేరేపిత చర్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెడుతున్నారు:కేశినేని నాని
Kesineni Nani

విజయవాడ, జూన్4 (ఆంధ్రజ్యోతి): తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబుపై రాజకీయ ప్రేరేపిత చర్యలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేశినేని నాని ఓ పోస్టు పెట్టారు. విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశంగా మారింది.


గత రెండు సంవత్సరాలుగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని కేశినేని నాని పేర్కొన్నారు. అయినప్పటికీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన స్నేహితుడు తాతినేని రాంబాబుపై ప్రస్తుత ఎంపీ ప్రోత్సాహంతో తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.


అలాగే, విజయవాడ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన పీఎస్ఐ నవీన్ రాంబాబు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి ఆయన తల్లిని వేధించారని కేశినేని నాని పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల ఒక అమాయక కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను వారి కుటుంబాలపై ప్రభావం చూపే విధంగా ఉపయోగించకూడదని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకుండా చూడాలని, సంబంధిత ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేశినేని నాని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 08:58 AM