పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నా: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:44 PM
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
విజయవాడ, అక్టోబర్ 16: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు(శుక్రవారం) మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో పిల్లలకు విద్యాబుద్ధులు, విజ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నానని ఎక్స్లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పార్థసారథి
సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ బ్రహ్మాండంగా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు చేసిందని అన్నారు. సామాన్య భక్తుల దర్శనమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాడిపంటలు రైతులకు సమృద్ధిగా ఉండాలని, యువతకు అవకాశాలు మెండుగా ఉండాలని, ఎలాంటి రాక్షస శక్తులు విఘ్నాలు కలిగించినా అవి నిర్వీర్యం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి దుర్గమ్మ ఆశీస్సులుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
అద్భుతంగా దసరా మహోత్సవాలు: మంత్రి కొల్లు రవీంద్ర
అన్ని శాఖలు కలిసి అద్భుతంగా దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 85 వేల మంది భక్తులు ఇప్పటివరకూ కనకదుర్గమ్మను దర్శించుకున్నారని వెల్లడించారు. గతంలో వీఐపీల వలన ఇబ్బంది ఉండేదని.. దర్శనం క్యూలు ఎక్కడా ఆగకుండా మానిటర్ చేస్తున్నారని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు
వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News