చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం?... బాధితుల ఆందోళన
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:10 PM
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కృష్ణాజిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు.. పేదలు కష్టపడి దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే వారు, ఇళ్లలో పనిచేసే వారు, ఇతర రోజువారీ కూలీలు, పేద కుటుంబాలే ఈ చిట్టీలకు ప్రధానంగా డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చిట్టీ డబ్బులు అడిగిన సమయంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు తమతో గొడవకు దిగేవారని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై సుమారు 15 రోజుల క్రితమే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా నిర్వాహకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని అడ్డుకున్నామని బాధితులు తెలిపారు. తమ వద్ద నుంచి సేకరించిన చిట్టీ డబ్బులతో శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిట్టీల పేరుతో పేదల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News