Share News

పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి.. 60 వేల మందికి పట్టాలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:03 PM

‘నేడు ఇంతమంది ముఖాల్లో నవ్వులు చూస్తున్నా. నా‌ జీవితంలో ఈరోజును తప్పకుండా గుర్తు పెట్టుకుంటా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన పేదల పట్టాల పండుగ సభలో సీఎం మాట్లాడారు.

పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి.. 60 వేల మందికి పట్టాలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

విజయవాడ, సెప్టెంబర్ 30: ‘నేడు ఇంతమంది ముఖాల్లో నవ్వులు చూస్తున్నా. నా‌ జీవితంలో ఈరోజును తప్పకుండా గుర్తు పెట్టుకుంటా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదల పట్టాల పండుగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తెలిపారు. మిత్రులు పవన్ కల్యాణ్, మోదీతో ‌కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నేడు అభివృద్ధి, సంక్షేమంలో జెట్ స్పీడుతో ముందుకు సాగుతున్నామన్నారు. విశాఖ, మంగళగిరి, నేడు విజయవాడలో ఇన్ని వేల మందికి పట్టాలు ఇవ్వడం జీవితంలో మరచిపోనని అన్నారు. అరవై వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.19 వేల కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.52 వేల కోట్లని వెల్లడించారు.


అందుకే పేదలకు పట్టాభిషేకమని పేరు పెట్టాం..

130 చ.గ లు యావరేజ్‌ను ఇచ్చామని, సరాసరి కోటి నుంచి రెండు కోట్ల ఆస్తిని అప్పగించామని సీఎం తెలిపారు. అందుకే పేదలకు పట్టాభిషేకమని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. యాభై, అరవై ఏళ్ల కలను సాకారం చేశామన్నారు. నిన్నటి ‌వరకు ఆస్తి ఉన్పప్పటికీ దానిని ఉపయోగించే పరిస్థితి లేదని.. ఇప్పుడు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పేదల సంతోషమే నిజమైన అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. ‘ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారికి పట్టాలు ఇచ్చాం.. ఇందుకు కృషి చేసిన మీ ఎమ్మెల్యేలు, అధికారులకు మీరు కృతజ్ఞత చెప్పాలి. ఎన్నికలలో మేము సుపరిపాలన అందిస్తామని చెప్పాం. మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ‌ ఇచ్చాం’ అని అన్నారు.


అమ్ముకోవద్దు.. కాపాడుకోండి

ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని ముఖ్యమంత్రి అన్నారు. కూడు, గూడు, గుడ్డ పేదలకు ఇవ్వాలని అన్న ఎన్టీఆర్ మొదలు పెట్టారని.. అదే విధానాన్ని తాము అమలు చేసి పేదల గుండెలో ఆనందాన్ని నింపామని చెప్పారు. అబ్జక్షన్ లేని భూములను పేదలకు ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశామన్నారు. ‘ఇది వారసత్వ హక్కు.. మీరు అమ్ముకోవద్దు.. కాపాడుకోండి’ అని సూచించారు. పేదలు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఆనందంగా జీవించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను సులభతరం చేశామని చెప్పారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


రాజముద్రతో మీ ఆస్తులు మీకిచ్చాం..

2019-24 మధ్య ప్రభుత్వమే భూ‌వివాదాలను ప్రోత్సహించిందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ఆస్తుల‌పై వారి ఫొటోలు పెట్టుకున్నారని వైసీపీపై మండిపడ్డారు. ‘కూటమి ప్రభుత్వంలో నా ఫొటో లేదు, నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఫొటో లేదు. కేవలం ప్రభుత్వం రాజముద్రతో మీ ఆస్తులు మీకు‌ ఇచ్చాం’ అని వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ఆస్తులు కొల్లగొట్టాలని చూశారని ఆరోపించారు. కీలుబొమ్మల్లాగా ప్రజలను ఆడించాలని చూస్తే ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. తాము ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని.. పేదల ఆస్తులకు భద్రత, భరోసా కల్పించామని చెప్పారు. రూపాయి కూడా లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ ‌చేయించామని తెలిపారు.


వేగంగా అభివృద్ధి పనులు..

రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని సీఎం తెలిపారు. అన్ని రహదారుల నిర్మాణం చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అన్నారు. పోలవరం లెప్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు‌ నీరు ఇచ్చామని.. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తున్నామని చెప్పారు. వైసీపీ గొడ్డలి పార్టీ పట్టిసీమకు అడ్డుపడితే... తాము కట్టి చూపామన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు 490 టీఎంసీల నీరు గోదావరి నుంచి మళ్లించామన్నారు. ఈ ఏడాది వర్షాలు లేవని.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరు ఇచ్చామని తెలిపారు. 14 వందల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వెళుతున్నాయని, వంద టీఎంసీల నీరు తెస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు.


ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

‘మీకు హామీ ‌ఇస్తున్నా.. పోలవరం పూర్తి చేస్తాం... నీటిని కృష్ణా డెల్టా, రాయలసీమకు మళ్లిస్తాం. కొంతమంది స్వార్థపరులు వారు బాగుంటే చాలు అనుకుంటారు. మేము అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. గోదావరి, కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణ రాష్ట్రాలకు నీటి కొరత ఉండదు. భవిష్యత్తులో 36 ప్రాజెక్టు‌లను పూర్తి చేస్తాం. కృష్ణా పుష్కరాల సమయానికి గోదావరి, కృష్ణా నీరు పుష్కలంగా మనకి వస్తాయి. అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రభుత్వానికి రెండు కళ్లు. పేదలకు ఆదాయ మార్గాలు‌ చూపి జీవన ప్రమాణాలు పెంచాలి. రేపు ఉదయం ఆరు గంటలకే గుడ్ మార్నింగ్ చెప్పి‌ పెన్షన్ అందిస్తాం. ఉద్యోగులకు ఆలస్యం అయినా.. పెన్షన్‌‌దారులకు ఆలస్యం చేయకుండా అందిస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ‌మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగింది. భవిష్యత్తులో ఏసీ బస్సులే కొంటాం.. పేదలు అందులోనే ప్రయాణం చేయాలి’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

వివేకా హత్య కేసులో ఆరోపణలపై ఎందుకు మౌనం?.. జగన్‌కు మంత్రి నిమ్మల సూటి ప్రశ్న

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 04:23 PM