Share News

చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: కాల్వ శ్రీనివాసులు

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:55 PM

రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.

చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి: కాల్వ శ్రీనివాసులు
Kalava Srinivasulu

అమరావతి, సెప్టెంబర్ 4: రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా సాగునీటి రంగానికి కొత్త కళ వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించే శక్తి ఆయనకు మాత్రమే ఉందన్నారు. రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలనే ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని... ఆయన ఆశలను ఆకాంక్షలను ఆచరణలో పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు.


కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మేలు కలిగించే హంద్రీనీవాకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. 2014-19లో రూ.12,441 కోట్లు రాయలసీమకు చంద్రబాబు ఖర్చు చేస్తే.. జగన్ రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. 30 ఏళ్ల వెలిగొండ కలను సాకారం చేసి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు అందించిన నేత చంద్రబాబు అని అన్నారు. ఏ ప్రాంతంలో అయితే సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అటువంటి చోట గోదావరి, కృష్ణా జలాలను తరలించి ఆ ప్రాంతాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు.


రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అయినా సాగునీటి ప్రాజెక్టుల పేరు చెప్పే నాయకుడు చంద్రబాబు అని.. సాగునీటి ప్రాజెక్టుల పేరు ఎత్తే హక్కు, అర్హత జగన్ రెడ్డికి లేదని ప్రభుత్వ విప్ విమర్శించారు. వెలిగొండకు రూ.5,233 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తే... జగన్‌ ఖర్చు చేసింది కేవలం రూ.841 కోట్లు అని వెల్లడించారు. 55 శాతం పనులు చేసిన చంద్రబాబుది క్రెడిట్ చోరీనా... 8 శాతం పనులు చేసిన జగన్‌ది క్రెడిట్ చోరీనా అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో తెలంగాణ వాసులకు రాయలసీమపై వ్యతిరేక భావన నింపిన దుర్మార్గుడు జగన్ అంటూ మండిపడ్డారు. నవ్యాంధ్రకు 512 టీఎంసీల కృష్ణా జలాలను సాధించి రాష్ట్రానికి తీసుకొచ్చిన నేత చంద్రబాబు అని అన్నారు. 798 అడుగుల నుంచే కృష్ణా జలాలను రాయలసీమకు ముచ్చుమర్రి ద్వారా తీసుకెళ్లేందుకు టీడీపీ అధినేత కృషి చేశారన్నారు. పోలవరంకి చంద్రబాబు రూ.20,085 కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్ఆర్, జగన్‌లు కేవలం రూ.3,021 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. పోలవరం క్రెడిట్ చంద్రబాబుది అని.. క్రెడిట్ చోరీ చేస్తోంది జగన్ అంటూ ఆరోపించారు.


ఏ నాయకత్వంలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.. ఏ నాయకుడి వల్ల ప్రాజెక్టులు కుంటు పడ్డాయో ప్రజలు గమనిస్తున్నారని శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్, జగన్ రెడ్డిల వల్లే పోలవరం ఇంత ఆలస్యం అయిందని వ్యాఖ్యానించారు. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా పోలవరం, వెలిగొండపై క్రెడిట్ చోరీ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే మూడేళ్లల్లో 36 సాగునీటి ప్రాజెక్టులను రూ.35 వేల కోట్లతో పూర్తి చేయబోతున్నామని చెప్పారు. హంద్రీనీవా ద్వారా రాయలసీమకు, వెలిగొండ ద్వారా ప్రకాశంకి, పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని కొనియాడారు. చంద్రబాబుతోనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని.. ఆయన వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సీజ్‌ చేసిన సిగరెట్ల విక్రయం.. భాకరాపేట ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్

దారుణం.. అనుమానంతో భార్యపై విచక్షణారహితంగా..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 03:06 PM