Share News

అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:13 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉద్యోగాల అమ్మకాల స్కాంల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నట్టేట మునిగారని తెలిపారు.

అన్ని నియామకాలను స్కాంగా మార్చేశారు.. వైసీపీపై బుద్దా వెంకన్న ఫైర్
Budda Venkanna

విజయవాడ, సెప్టెంబర్ 18: నగరంలోని వన్ టౌన్ గాంధీజీ మహిళా కళాశాలలో విద్యార్థినిలతో నిర్వహించిన ‘జెన్ జీ - ఇంటరాక్షన్’ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అడిగిన ప్రశ్నలకు, మెగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లపై వారికున్న సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఉద్యోగాల అమ్మకాల స్కాంల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నట్టేట మునిగారని తెలిపారు. గత వైసీపీ పాలనలో కష్టపడి చదివిన ప్రతిభావంతులను పక్కనబెట్టి, బ్యాక్ డోర్‌లో వారి అనుచరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. గ్రూప్స్ పరీక్షలతో సహా అన్ని నియామకాలను ఒక పెద్ద స్కాంగా మార్చేశారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులందరికీ కఠిన శిక్షలు పడేలా చేస్తోందని బుద్దా వెంకన్న వెల్లడించారు.


గత ప్రభుత్వ పాపాలను కడుగుతూ మంత్రి లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. మళ్లీ లీకేజీలు, అవకతవకలు అనే మాట వినపడకుండా అత్యంత పారదర్శకమైన, ఆధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త నియామక వ్యవస్థను తీసుకువస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయగ.. దానిని కోర్టు చిక్కులు లేకుండా, అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇస్తూ ఎంతో బాధ్యతాయుతంగా విద్యాశాఖ ముందుకు తీసుకెళ్తోందన్నారు. నవతరం విద్యార్థుల ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ప్రైవేట్ రంగాల్లో లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేశ్ అంతర్జాతీయ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తున్నారని తెలిపారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని.. వాస్తవాలు అందరికీ తెలియ చెప్పేందుకే జెన్ జీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్

తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి నిల్వలు భారీగా తగ్గాయి: మంత్రి ఉత్తమ్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 03:22 PM