Share News

బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్.. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో ఎంఓయూ

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:03 PM

డా.లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ P4 మోడల్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ స్టడీ చరిత్రలోనే నిలిచిపోయేలా P4 మోడల్‌లో MOU కుదుర్చుకున్నట్లు చెప్పారు.

బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్.. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో ఎంఓయూ
Minister Savitha

అమరావతి, అక్టోబర్ 12: డా.లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ P4 మోడల్‌లో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ స్టడీ చరిత్రలోనే నిలిచిపోయేలా P4 మోడల్‌లో MOU కుదుర్చుకున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా P4లో అవగాహన ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో బీసీ నిరుద్యోగ యువతకు సివిల్స్ కోచింగ్ ఉచితంగా అందజేయడానికి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఈ ఎంఓయూ వల్ల సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని కలలుగనే బీసీ యువతకు ఎంతో లబ్ధి కలుగుతుందని తెలిపారు.


బీసీ యువతకు ఎంతో మేలు

బీసీ నిరుద్యోగ యువతకు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ నుంచి మెటీరియళ్లు ఉచితంగా అందజేస్తారని మంత్రి చెప్పారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన అధ్యాపకులు శిక్షణ అందజేయనున్నారని తెలిపారు. ఈ ఎంఓయూ బీసీ యువతకు ఎంతో మేలు కలుగుజేస్తుందనడంలో సందేహం లేదన్నారు. బీసీ యువతను కలెక్టర్లగా, ఎస్పీలుగా, ఇతర ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేస్తూ వస్తున్నామని మంత్రి వెల్లడించారు.


2 ఏళ్లలో 200 మందికి ఉచిత శిక్షణ

రెండు విడతల్లో 200 మందికి ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ అందజేశామని మంత్రి తెలిపారు. మొదటి బ్యాచ్‌కు 2024-25లో 100 మందికి శిక్షణ అందించామన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ, గొల్లపూడిలోని బీసీభవన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ద్వారా 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం జరిగిందని చెప్పారు. 2025-26లో 2వ బ్యాచ్‌లో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం జరిగిందని మంత్రి చెప్పారు.


ఈ శిక్షణ ద్వారా

ఈ శిక్షణ ద్వారా 21 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్-II ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించారని సవిత తెలిపారు.. 12 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్-II మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారన్నారు. బ్యాంకులు, పోలీస్ కానిస్టేబుళ్లు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల వంటి ఇతర పోటీ నియామకాల్లో 44 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని చెప్పారు.


మెగా డీఎస్సీ 2024-25 పరీక్షకు ఉచిత కోచింగ్

ఏపీలోని 26 జిల్లాల ద్వారా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో మొత్తం 6,267 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ 2024-25 పరీక్షకు ఉచిత శిక్షణ అందించామని సవిత అన్నారు. ఈ శిక్షణ ద్వారా 281 మంది అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. త్వరలో డీఎస్సీకి, ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు

ఏపీలో 17 మేయర్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 04:15 PM