Share News

స్థానిక ఎన్నికలపై కూటమి భేటీ.. సమన్వయంతో పనిచేయాలని మంత్రుల పిలుపు

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:31 PM

బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలపై కూటమి భేటీ.. సమన్వయంతో పనిచేయాలని మంత్రుల పిలుపు
Local Body Elections

విజయవాడ, సెప్టెంబర్ 26: బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, బాపట్ల, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పని చేసేలా సమన్వయ కమిటీలు వేశారని.. ఈరోజు సమావేశమై కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. గెలుపే లక్ష్యంగా ఒకచోట ఒకరు తగ్గినా, మరొక చోట ఇంకొకరు తగ్గేలా సమన్వయం చేస్తామని చెప్పారు.


వైసీపీకి అసలు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని మంత్రి విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం‌లేదని.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శాసనమండలిలో మాత్రం సంఖ్యా బలం ఉందని వచ్చి గందరగోళం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు పోటీ‌పై‌ పునరాలోచన చేసుకోవాలని హితవుపలికారు. ఐదేళ్లల్లో ఒక్క ప్రాజెక్టు కూడా వాళ్లు‌ పూర్తి చేయలేదన్నారు. గత వైసీపీ ‌హయాంలో ఏయే మున్సిపాలిటీకి ఎన్ని నిధులు‌ ఇచ్చారో ప్రజలకు ‌చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో మున్సిపాలిటీలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వివరించారు. మరో రూ.140 కోట్లు తెచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు‌ పంపామన్నారు.


కూటమి‌ పార్టీ నేతల మధ్య సమైక్యత ఉందని పార్థసారథి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ చూపే స్పూర్తితో 94 శాతానికి మించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము యూనానిమస్ అని ఎక్కడా చెప్పలేదని... వాళ్లే భయపడి మాట్లాడుతున్నారని తెలిపారు. టీచర్ల ఉద్యమంలో గంజాయి బ్యాచ్, రౌడీలు, గుడ్లతో దాడులు చేయిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. వాళ్లపై వాళ్లకే నమ్మకం లేకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.


స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మంత్రి అనగాని

నేడు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు.. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. గెలుపే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అందరం క‌లిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. పవన్ కల్యాణ్ పల్లె వెలుగు ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 03:40 PM