Share News

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:04 PM

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు
Vijayawada durgudi ghat road

విజయవాడ, సెప్టెంబర్ 26: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి ఘాట్‌రోడ్డును కమిషనర్ పరిశీలించారు. భక్తుల రక్షణే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన రక్షణ పనులు పూర్తి చేయాలని కమిషనర్ తెలిపారు.


NIRM నివేదిక ఆధారంగా శాశ్వత భద్రతా చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కమిషనర్ తెలిపారు. బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నిపుణులతో చర్చలు జరపాలన్నారు. వర్షపు నీటి కారణంగా వదులైన రాళ్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలని సూచించారు. కొండ వాలును పటిష్ఠం చేసేందుకు రాక్ బోల్టింగ్, షాట్‌క్రీటింగ్ పనులను పరిశీలించాలన్నారు. కొండపై నుంచి రాళ్లు రోడ్డుపైకి రాకుండా రాక్‌ఫాల్ నెట్టింగ్‌ను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త హైటెన్సైల్ ఐరన్ ఫెన్సింగ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.


కొండపై నుంచి వర్షపు నీరు నేరుగా కిందకు వెళ్లేలా ప్రత్యేక డ్రైనేజీ చానల్స్ ఏర్పాటు చేయాలని రామచంద్ర మోహన్ ఆదేశించారు. NIRM నిపుణుల సూచనల మేరకు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి ఘాట్‌రోడ్డు పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. రక్షణ పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఘాట్‌రోడ్డు పరిశీలనలో దేవాదాయ కమిషనర్‌తోపాటు NIRM శాస్త్రవేత్త జైన్, సాంకేతిక సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ శేఖర్, ఈవో వి.కె. శీనా నాయక్ పాల్గొన్నారు. కాగా.. భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే దసర నవరాత్రి ఉత్సవాలకు రోడ్డు మరమత్తు పనుల కారణంగా ఘాట్‌రోడ్‌ మూసివేశారు. దీంతో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.


ఇవి కూడా చదవండి...

రానున్న రోజుల్లో పోలీసు శాఖలో మరిన్ని నియామకాలు: మంత్రి టీజీ భరత్

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 12:10 PM