Share News

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:18 PM

దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి.

ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డులు.. ఏపీ, తెలంగాణకు పలు విభాగాల్లో గోల్డ్ అవార్డులు
SKOCH Gold Award

ఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశ రాజధాని ఢిల్లీలో 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలు ప్రభుత్వ విభాగాలు, సంస్థలకు స్కోచ్ గోల్డ్ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ (ఏపీ ఎస్ఎస్ఏఏటీ)కి గుడ్ గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. సంస్థ డైరెక్టర్ జి.శ్రీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ మైలురాయిని అందుకున్నామని ఆయన తెలిపారు. గుడ్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.


ఏపీలోని 13,396 గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా గ్రామసభలు నిర్వహించామని.. 100 శాతం మండల పబ్లిక్ హియరింగ్స్ పూర్తి చేసినట్లు శ్రీకాంత్ చెప్పారు. ప్రతి గ్రామసభ, పబ్లిక్ హియరింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేశామని తెలిపారు. సోషల్ ఆడిట్ నివేదికలన్నీ డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. ఏపీ నమూనా అధ్యయనానికి 22 రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. గత రెండేళ్లలో 12 లక్షల పనుల పర్యవేక్షణతో పాటు 43.4 లక్షల శ్రామిక కుటుంబాల వద్దకే సామాజిక తనిఖీని తీసుకెళ్లినట్లు చెప్పారు. MGNREGS, పెన్షన్లు, సమగ్ర శిక్షపై సోషల్ ఆడిట్ నిర్వహించినట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.


ఏఎన్‌జీఆర్‌ఏయూకు స్కోచ్ గోల్డ్ అవార్డు

ఆహార భద్రతలో విశిష్ట సేవలకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏఎన్‌జీఆర్‌ఏయూ)కి స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. స్కోచ్ సమ్మిట్‌లో జాతీయ స్థాయిలో ఈ గౌరవం దక్కింది.1964 నుంచి దేశ వ్యవసాయ రంగంలో ఏఎన్‌జీఆర్‌ఏయూ అగ్రగామిగా నిలిచింది. ఇప్పటివరకు 50 వేల మందికి పైగా విద్యార్థులను యూనివర్సిటీ తీర్చిదిద్దింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఏఎన్‌జీఆర్‌ఏయూ వరి రకాల సాగు చేస్తున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.పివి.సత్యనారాయణ తెలిపారు. దేశ వరి విస్తీర్ణంలో 33 శాతం ఏఎన్‌జీఆర్‌ఏయూ అభివృద్ధి చేసిన రకాలే ఉన్నాయన్నారు.


వేరుశెనగ సాగులో 65శాతం వరకు, అపరాల పంటల్లో 10-12శాతం వరకు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన రకాలను సాగు చేస్తున్నట్లు వైస్‌ ఛాన్సలర్ వెల్లడించారు. జాతీయ ఆహార భద్రతకు ఏఎన్‌జీఆర్‌ఏయూ పరిశోధనలు కీలకంగా నిలిచాయన్నారు. స్కిల్ సెంటర్లు, డ్రోన్ సెంటర్లతో రైతులకు ఆధునిక సేవలు అందించినట్లు తెలిపారు. ఇన్నోవేటివ్ ఫార్మర్స్ నెట్‌వర్క్‌తో సాంకేతికతను రైతు వద్దకే తీసుకెళ్లామని చెప్పారు. డేటా ఆధారిత వ్యవసాయ సేవలకు గాను జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. సమగ్ర పరిశోధనలు, రైతు సేవలకే స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కిందన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులకు పీవీ సత్యనారాయణ అభినందనలు తెలియజేశారు.


తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్ గోల్డ్ అవార్డు

తెలంగాణ జైళ్ల శాఖకు కూడా 109వ స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. ‘నివృతి’ డీ-అడిక్షన్ కేంద్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. డ్రగ్‌-ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. నశా ముక్త్ భారత్-మిషన్ పరివర్తన్ కింద ఏర్పాటు చేసిన ‘నివృతి’ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 8 వేల మంది ఖైదీలకు ప్రయోజనం చేకూరినట్లు వెల్లడించారు. వ్యసన విముక్తితో పాటు పునరావాస సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలపై వెల్లూరు ప్రాంతీయ జైళ్ల అకాడమీ ఇంపాక్ట్ స్టడీ చేస్తోందన్నారు. 'నివృతి' కేంద్రాలకు 87 శాతం విజయవంతమైన ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఎన్జీవోల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, విడుదలైన తర్వాత కూడా ఖైదీలకు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నట్లు చెప్పారు.


ఖమ్మం సహా సరిహద్దు ప్రాంతాలకు ఈ కేంద్రాలను విస్తరించే ప్రతిపాదన ఉన్నట్లు సౌమ్యా మిత్ర తెలిపారు. ఇలాంటి కేంద్రం ముందే అందుబాటులో ఉంటే జైలుకు వచ్చేవాడిని కాదని కొంతమంది మాజీ ఖైదీలు చెబుతున్నారని అన్నారు. బెయిల్ వచ్చినప్పటికీ కోర్సును పూర్తి చేసి వెళ్లిన ఖైదీ మరో ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఖైదీల కుటుంబాల నుంచి కూడా డీ-అడిక్షన్ కేంద్రాల సేవల కోసం విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించారు. వ్యసన నిర్మూలనలో తెలంగాణ జైళ్ల శాఖకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

Read Latest AP News And Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 02:25 PM