రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న గొడ్డలి పార్టీ: మంత్రి డోలా
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:04 PM
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విధ్వంసం సృష్టించాలని చూస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే.. రాజకీయంగా అడ్డంకులు సృష్టించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
అమరావతి, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విధ్వంసం సృష్టించాలని చూస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే.. రాజకీయంగా అడ్డంకులు సృష్టించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. శనివారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. గురువులను గౌరవించాల్సిన సమాజంలో టీచర్లపైనే దాడులకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. టీచర్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని వైసీపీ నేతలకు సూచించారు. రాజకీయంగా బలహీనపడుతున్న కొద్దీ వైసీపీ రోడ్లపై ఆందోళనలతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓ అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే దుష్ట సంప్రదయాన్ని మళ్ళీ అమలు చేస్తుందంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.
డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తే.. రోజుకో కొత్త ఆరోపణలతో వైసీపీ నేతలు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ రోజు పేపర్ లీక్ అంటారు.. మరో రోజు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అంటారు.. ఇంకోరోజు కులం పేరుతో ఆరోపణలు చేస్తారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఎండగట్టారు. ఓకే ఆరోపణను పదే పదే చెప్పి నిజం చేయాలన్న వైసీపీ ప్రయత్నాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. డీఎస్సీపై నిజంగా అనుమానాలుంటే ఆధారాలు బయటపెట్టాలని వైసీపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు.
నిన్న మీ మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ.. మీకు రెండేళ్లు పట్టింది.. మేం నెలలోనే మీ అంతు తెలుస్తామని అంటున్నారని.. అంటే రౌడీలు, గుండాలని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని వైసీపీ నేతలకు ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ ముసుగులో నేరస్థులను కాపాడుతూ.. నేరాలను ప్రోత్సహిస్తూ.. రాష్ట్రంలో ఆస్తులు ధ్వంసం చేస్తూ, లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వైసీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే వైసీపీ వ్యూహంలా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ దుకాణం మూసేసుకునే రోజు తొందరలోనే ఉందని జోస్యం చెప్పారు. వేలాది అభ్యంతరాలు, కోర్టు ప్రక్రియలు, అన్ని అడ్డంకులు దాటుకుని16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకురావడం మానుకోవాలంటూ వైసీపీ నేతలను మంత్రి డోలా హితవు పలికారు.
అసత్యాలు, ఆరోపణలు, ఆందోళనలతో యువత భవిష్యత్తును రాజకీయం కోసం ఉపయోగించుకోవద్దని వైసీపీ నేతలకు ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్‌తో యువతకు భరోసా కల్పించే దిశగా ముందుకు వెళ్తోందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు
Read Latest AP News And Telugu News