మచిలీపట్నంలో ఉద్యోగినికి వేధింపులు.. మహిళా కమిషన్ విచారణ
ABN , Publish Date - Apr 24 , 2026 | 08:54 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడంతో విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని అదే కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలు ముందుగా కలెక్టర్‌ను ఆశ్రయించినప్పటికీ, తనకు న్యాయం జరగలేదని పేర్కొంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మచిలీపట్నానికి చేరుకుని ప్రత్యక్షంగా విచారణ చేపట్టారు. ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కార్యాలయ సిబ్బందిని విచారించారు. లోకల్ కంప్లైంట్ కమిటీ సభ్యులతో కూడా రాయపాటి శైలజ మాట్లాడారు.
బాధితురాలికి న్యాయం హామీ..
బాధితురాలికి న్యాయం చేస్తామని రాయపాటి శైలజ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తామని.. ఆ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యేకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే స్పందన లేకపోవడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మచిలీపట్నం కలెక్టరేట్‌లో జరిగిన ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాయపాటి శైలజ జోక్యం చేసుకోవడంతో న్యాయం జరగుతుందని బాధితురాలు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News