Share News

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలే త్వరగా వైరల్ అవుతున్నాయి: రాయపాటి శైలజ

ABN , Publish Date - Jul 12 , 2026 | 09:00 PM

నేటి కాలంలో డాక్యుమెంటరీలు లేదా షార్ట్ ఫిలిమ్స్ కంటే సినిమాలే యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి కంటే చెడు వైపు త్వరగా ఆకర్షితులు అవుతున్నారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలే త్వరగా వైరల్ అవుతున్నాయి: రాయపాటి శైలజ
Rayapati Shailaja

విజయవాడ, జులై 12 (ఆంధ్రజ్యోతి): నేటి కాలంలో డాక్యుమెంటరీలు లేదా షార్ట్ ఫిలిమ్స్ కంటే సినిమాలే యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Shailaja) వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి కంటే చెడు వైపు త్వరగా ఆకర్షితులు అవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) విజయవాడలో జరిగిన మూడో ప్రపంచ తెలుగు రచయిత్రుల మహాసభల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ ప్రసంగించారు.


వాటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది..

మహిళా రచయితలు తమ కవితలను, రచనలను, జీవిత అనుభవాలను సినిమా స్క్రిప్ట్‌లుగా మార్చాలని రాయపాటి శైలజ సూచించారు. ఆడపిల్లలపై సినిమాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు సాహిత్యం కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అది సమాజానికి దిశానిర్దేశం చేస్తోందని తెలిపారు. తరిగొండ వెంగమాంబ నుంచి నేటి రచయితల వరకు అందరూ సమాజ మార్పు కోసం కృషి చేస్తున్నారని వివరించారు. మహిళలు బయటకు వచ్చి పని చేస్తున్నారంటేనే వారు ప్రయాణాల నుంచి పని ప్రదేశాల వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధపడి వస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళలు విమర్శలను తట్టుకోవాలని అంటారని, కానీ వారిపై అభ్యంతరకరంగా మాట్లాడటం సరైనది కాదని పేర్కొన్నారు.


పుస్తకాలు చదివే విధానంలో మార్పు వచ్చింది..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో మంచి విషయాల కంటే, తప్పుడు మాటలు లేదా వివాదాస్పద వ్యాఖ్యలే త్వరగా వైరల్ అవుతున్నాయని రాయపాటి శైలజ తెలిపారు. మహిళా సాధికారత అంటే కేవలం చదువుకోవడం లేదా ఉద్యోగం చేయడం మాత్రమే కాదని, అది మహిళలకు ఉండే స్వతంత్రమని చెప్పుకొచ్చారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు మహిళలను వెనక్కు లాగుతుంటారని అన్నారు. కానీ రచయిత్రులకు మాత్రమే కలం, స్వరం ద్వారా సమాజాన్ని మార్చగల శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలు చదివే విధానంలో మార్పు వచ్చిందని వివరించారు. ఇప్పుడు పుస్తకాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. నేటి తరంలో ఏకాగ్రత తగ్గిపోవడంతో, ప్రజలు ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటున్నారని అన్నారు. అందుకే సమాచారం 30 సెకన్ల నుంచి ఓ నిమిషంలోపు ఉండాలని భావిస్తున్నారని చెప్పారు.


బ్లాగులు శక్తివంతమైన సందేశాలను ఇస్తాయి..

బ్లాగులు తక్కువ సమాచారాన్ని అందించినప్పటికీ, అవి చాలా శక్తివంతమైన సందేశాలను ఇస్తాయని రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. ఒక అమ్మాయి పుస్తకం చదివితే ఆమె జీవితం మాత్రమే మారుతుందని, కానీ ఒక మహిళ రచన చేస్తే మొత్తం సమాజమే మారుతుందని వెల్లడించారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో కేవలం ట్యాబ్‌లు, డిజిటల్ విద్య మాత్రమే కాకుండా, పుస్తకాలు చదవడం, నీతి కథల ప్రాధాన్యం పెరగాలని సూచించారు. పిల్లల్లో ఉండే సృజనాత్మకతను, శక్తిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించడానికి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయని వ్యాఖ్యానించారు. రచయితల కలం ఎప్పుడూ ఆగకూడదని, నిరంతరం రాస్తూనే ఉండాలని సూచించారు. రచనల ద్వారానే మనం భావితరాలకు, పిల్లలకు గొప్ప విషయాలను అందించగలమని తెలిపారు. ఈ ప్రపంచ రచయిత్రుల మహా సభల ద్వారా మహిళా రచయితలు సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని రాయపాటి శైలజ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు

యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 09:19 PM