Share News

‘మావిగన్’ అంటూ నీతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

ABN , Publish Date - May 12 , 2026 | 05:26 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్నిఅభివృద్ది చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

‘మావిగన్’ అంటూ నీతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
AP Minister Kollu Ravindra

కృష్ణా జిల్లా మచిలీపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడి చూపు రాష్ట్రంపై పడకూడదని నాడు ఆయన తండ్రే తరిమేశారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ రెడ్డి రాష్ట్రంపై తన దుర్మార్గాలకు శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు.


ఐదేళ్లు అరాచకం సృష్టించారు..

మూడు రాజధానుల పేరుతో అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకం సృష్టించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహించారు. భూములిచ్చిన రైతన్నలను పోలీసుల లాఠీలతో కొట్టించి, బూటు కాళ్లతో తన్నించారని విమర్శించారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా బొక్కేసినోళ్లు కూడా నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రో కో ద్వారా ప్రజల ఆస్తులను దోచారని మండిపడ్డారు. ఐదేళ్లు అడ్డగోలుగా దోచుకుని అమరావతి నిర్మాణంపై నిందలేయడం సిగ్గుచేటని అన్నారు. మావిగన్ అంటూ ఇప్పుడు మాట్లాడే వైసీపీ నేతలు.. గత ఐదేళ్లు ఏం చేశారు..? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి భజన చేయడం తప్ప వైసీపీ నేతలు సొంత బుర్రలు వాడటం మానేశారని సెటైర్లు గుప్పించారు.


రాష్ట్రాభివృద్ధి పట్టదా..?

అమరావతే రాజధాని అని ఒకసారి.. మూడు రాజధానులని మరోసారి.. ఇప్పుడు మావిగన్ అంటూ నీతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లోని వైసీపీ నేతలు జగన్ రెడ్డికి భజన చేయడం తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదా..? అని నిలదీశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాయలసీమకు గతంలో కియా, ఇప్పుడు డ్రోన్స్, డిఫెన్స్, రాయల్ ఎన్ ఫీల్డ్ తీసుకువచ్చామని ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో భోగాపురం, గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిట్టల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న బియ్యం దొంగ ఐదేళ్లలో బందరు పోర్టు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని తన స్థాయి మరిచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి మాట్లాడుతున్నారని కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 05:55 PM