Kollu Ravindra: మచిలీపట్నం పోర్టుని ఏడాదిలో పూర్తి చేస్తాం: మంత్రి రవీంద్ర
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:45 PM
కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా, జనవరి2 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) వ్యాఖ్యానించారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. దాదాపు రూ.400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.
పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లైఓవర్, అండర్ పాసులు ఉండాలో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇందుకోసం రూ. 2 వేల కోట్లు ఖర్చవుతాయని వివరించారు. అవుటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదన చేశామని తెలిపారు. విజయవాడ నుంచి గోశాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.
పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చెప్పారని ప్రస్తావించారు. కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారి 350 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. ఈ రహదారికి తీర ప్రాంత గ్రామాలు తాళ్లపాలెం, గిలకలదింది, కోడూరు ప్రాంతాలను కలపాలని ఎమ్మెల్యేలు చెప్పారని అన్నారు. తీర ప్రాంతాలను కలుపుతూ హైవే నిర్మాణం చేస్తే ఆయా గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర.
పామర్రు నుంచి చల్లపల్లి వరకు ఉన్న రహదారిని పీఎం గతి శక్తి ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 4 లైన్ల నుంచి 6 లైన్ల రహదారిని అభివృద్ధి చేసే క్రమంలో ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కారం చేసేలా డీపీఆర్‌లో పెట్టాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని అన్నారు. కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశామని వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
Read Latest AP News And Telugu News