Share News

ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం

ABN , Publish Date - Jun 22 , 2026 | 02:00 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. ఈ కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు.

ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
AP Minister Anam Ramanarayana Reddy

అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. ఈ కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతంలో సమర్పించిన నివేదికలు పూర్తిస్థాయిలో లేవని భావిస్తున్నామని, అందుకే కొత్తగా విచారణ చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఈరోజు (సోమవారం) సచివాలయంలో మీడియాతో మంత్రి ఆనం మాట్లాడారు.


టికెట్ పంచింగ్ చేయకుండా మోసం చేస్తున్నారు..

కనకదుర్గ దేవాలయంలో నకిలీ టికెట్ల విషయంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు ఉండట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో అవుట్ సోర్సింగ్‌లో వచ్చే ఉద్యోగులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌లో టికెట్ పంచింగ్ చేయకుండా మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో డిజిటలైజ్ పూర్తిగా అయిపోతే ఒకే టికెట్ రిపీటెడ్‌గా రావడం తగ్గిపోతుందని స్పష్టం చేశారు. వాడపల్లిలో కొద్ది మాసాల్లోనే రూ. కోటి నుంచి సుమారు రూ.10 కోట్లకు ఆదాయం పెరిగిందని వివరించారు. కోనసీమ తిరుపతి కింద ఇప్పుడు వాడపల్లి ఉందని... అక్కడ భూమి లేదని చెప్పారు. ఎవరైనా డొనేషన్ చేస్తే మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. జగన్ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలపై ఇచ్చిన రిపోర్టులు సరిగా లేవని.. వాటిపై సమగ్ర విచారణకు ఆదేశించామని అన్నారు. ఆయా కేసుల్లో వాస్తవాలు నిగ్గుతేల్చాలని కోరామని.. ఇలా రిపోర్టు ఇచ్చిన వారిపైనా విచారణ చేస్తామని స్పష్టం చేశారు.


కఠిన చర్యలు..

తప్పు చేసిన అధికారులు, బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఆలయాల్లో జరిగిన అక్రమాలు, పరిపాలనా లోపాలపై కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నామని అన్నారు. గతంలో నివేదికలు సమర్పించిన అధికారుల పాత్రపైనా విచారణ చేస్తామని పేర్కొన్నారు.


దేవాదాయ భూముల రక్షణపై దృష్టి..

దేవాదాయ శాఖకు చెందిన భూముల పరిరక్షణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఆనం స్పష్టం చేశారు. గతంలో జమీందారులు, ఇనాందారులు ఆలయాల నిర్వహణ కోసం భూములను కేటాయించేవారని, ప్రస్తుతం అలాంటి ఇనాం భూములు వేల ఎకరాల మేర ఉన్నాయని తెలిపారు.


ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం..

జగన్ హయాంలో నిర్లక్ష్యం కారణంగా ఆలయాల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని మంత్రి ఆనం ఆరోపించారు. ప్రస్తుతం అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం లక్షల ఎకరాల ఆస్తులు గుర్తించామని, భూముల వివాదాలకు సంబంధించిన సుమారు 2 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


పెన్నానది ఒడ్డున శివాలయ నిర్మాణం..

పెరుమాళ్ల పాడు శివాలయం ఇసుక తుఫానులో మునిగిపోయిందని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. కొంతమంది యువత కరోనా సమయంలో ఈ ఆలయాన్ని పెన్నానది పరివాహకంలోకి వెళ్లిపోయిందని చెప్పారని.. దానికి ప్రత్యామ్నాయ ఆలయాన్ని మంజూరు చేశామని తెలిపారు. దానికి స్థలం కూడా పెన్నానది ఒడ్డున కేటాయించి.. ఆలయ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఆలయం నిర్మాణానికి 18 మాసాలు పడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 02:44 PM