డిజిటల్ జనగణనపై విజయవాడ, మార్కాపురంలో 5కె రన్
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:57 AM
డిజిటల్ జనగణనపై ఆదివారం ఉదయం విజయవాడ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ స్థాయిలో 5కె రన్ కార్యక్రమాలు జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని 'డిజిటల్ జనగణన'ను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు.
విజయవాడ, మార్కాపురం ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): భారతదేశ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న డిజిటల్ జనగణన (Digital Census) ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సెన్సస్ సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ జనగణన) ఆప్షన్‌ను ప్రజలు వినియోగించుకోవాలని కోరుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ రోజు(ఆదివారం) ఉదయం విజయవాడ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ స్థాయిలో 5కె రన్ కార్యక్రమాలు జరిగాయి.

మార్కాపురంలో జనగణన ప్రచారంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా స్వీయ జనగణన ప్రచారం జోరుగా సాగింది. జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలిసి 5కె రన్‌ను ప్రారంభించారు. ఈ రన్ పట్టణంలోని సప్తగిరి లాడ్జి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉత్సాహంగా సాగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు సహా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని 'డిజిటల్ జనగణన' విజయవంతం చేయాలని నినాదాలు చేశారు.

పారదర్శకతకు 'డిజిటల్ జనగణన' నాంది: జేసీ ఇలక్కియా
విజయవాడలో నిర్వహించిన 5కె రన్‌ను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ జనగణన ప్రాముఖ్యాన్ని వివరించారు. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి ప్రతి ప్రశ్నా అడగటానికి చాలా సమయం పడుతుందని.. అదే ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' చేసుకుంటే సమయం ఆదా అవుతుందని వెల్లడించారు. స్వీయ నమోదు పూర్తిచేసిన తర్వాత ఒక యూనిక్ ఐడీ జనరేట్ అవుతుందని.. ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీని చూపిస్తే సరిపోతుందని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడం వల్ల డేటా విశ్వసనీయత పెరగడంతో పాటు ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం ఉందని వివరించారు. ఆ తర్వాత మే 1 నుంచి మే 30 వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సర్వే నిర్వహిస్తామని జేసీ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...
రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్.. మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
జగనన్న లే అవుట్‌లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు: మంత్రి కొల్లు రవీంద్ర
రైతులకు గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telangana News And International News And Telugu News