అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:57 AM
దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పార్లమెంట్‌లో రాజధాని అమరావతి బిల్లుపై అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు సమయం ఇవ్వలేదని అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారన్నారు. వైసీపీ నాయకులు మాత్రం లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లును వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసి, ఇప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.
యావత్ దేశమంతా కూడా అమరావతిని గొప్ప నగరంగా నిర్మించగలరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నమ్మకంతో పార్లమెంట్‌లో మద్దతు తెలిపారన్నారు ఎంపీ. కులం, మతం, పార్టీలకు అతీతంగా పార్లమెంట్‌లో మద్దతు తెలిపితే.. జగన్ మోహన్ రెడ్డి టీం మాత్రం అమరావతిని వ్యతిరేకించి, ఈ రోజు సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ మోహన్ రెడ్డి, టీమ్‌కు ఇంకా కక్ష, అసూయ పోలేదని విమర్శించారు. గత ఐదేళ్లు అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారికి ఇంకా బుద్ధి మారలేదన్నారు.
140 కోట్ల దేశ ప్రజల తరుఫున పార్లమెంట్ సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారని ఎంపీ తెలిపారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని అసూయతో వ్యతిరేకించి, బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ‘మావిగన్’ అనే కొత్త పేరుతో మరో మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లు ఆయన ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరిట మోసం చేసినట్టే, ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం చేసినట్టే.. ఇప్పుడు కూడా అదే డ్రామా మొదలెట్టారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ
Read Latest AP News And Telugu News