Share News

కదన రంగానికి ‘తారాగిరి’ సై!

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:10 AM

భారత ‘రక్షణ’ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టెల్త్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి (ఎఫ్‌41)’ శుక్రవారం జలప్రవేశం చేసింది.

కదన రంగానికి ‘తారాగిరి’ సై!

  • భారత నేవీ అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం

  • జల ప్రవేశం చేసిన అత్యాధునిక యుద్ధ నౌక

  • నౌకలో బ్రహ్మోస్‌ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలు

  • శత్రు ముప్పును పసిగట్టే ‘రాడార్‌’ దీని ప్రత్యేకత

విశాఖపట్నం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): భారత ‘రక్షణ’ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టెల్త్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి (ఎఫ్‌41)’ శుక్రవారం జలప్రవేశం చేసింది. విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం నిర్వహించారు. సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌కుమార్‌ త్రిపాఠి, తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సంబయ్‌ భల్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నౌకను ‘ప్రాజెక్టు 17ఏ’ శ్రేణిలో భాగంగా ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌)లో నిర్మించారు. తారాగిరిని యుద్ధ రంగంతో పాటు మానవతా సాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ వినియోగించేలా రూపొందించారు. అత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియాలో భాగంగా నిర్మించిన ఈ అత్యంత శక్తివంతమైన నౌకలో.. భూమి నుంచి ఆకాశంలోకి, భూమి నుంచి భూమిపైకి ప్రయోగించగల బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థలను అమర్చారు.


అదేవిధంగా అత్యాధునిక సెన్సార్లు, నిఘా, శత్రువుల ముప్పు సమయంలో అప్రమత్తం చేసే రాడార్‌ వ్యవస్థలను చేర్చారు. శక్తివంతమైన తుపాకులు 76 ఎంఎం ఎస్‌ఆర్‌జీఎంలతో పాటు రాకెట్లు, టార్పెడోలతో కూడిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థ కూడా ఇందులో ఉంది. అత్యాధునిక స్టెల్త్‌ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక.. భారత సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. పెరుగుతున్న భారత సముద్ర శక్తికి ‘తారాగిరి’ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత్‌ భారత్‌-2047లో సముద్ర రక్షణ అత్యంత కీలకమైందన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సముద్ర ముప్పుల నుంచి వాణిజ్య మార్గాలు, ఆయిల్‌ ట్యాంకర్లకు రక్షణ కల్పించడంలో నేవీది కీలక పాత్ర అని పేర్కొన్నారు. 6,670 టన్నుల బరువుండే ఐఎన్‌ఎస్‌ తారాగిరి కంబైన్డ్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ (సీవోడీవోజీ) ప్రొపల్షన్‌ ఆధారిత ప్లాంట్‌ ద్వారా పనిచేస్తుంది. దాదాపు 75 శాతానికి పైగా దేశీయ రక్షణ ఉత్పత్తులతో దీని నిర్మాణం చేపట్టడం గమనార్హం. ఈ నౌకను యుద్ధ నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించారు. తద్వారా ఇందులోని సిబ్బంది ఎదైనా ముప్పు ఎదురైతే.. తక్కువ సమయంలోనే అత్యంత కచ్చితత్వంలో స్పందించగలరు.

Updated Date - Apr 04 , 2026 | 05:11 AM