రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:39 AM
రాజమండ్రిలో మరోసారి పాలలో కల్తీ నిర్ధారణ అయ్యింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.
రాజమండ్రి, ఏప్రిల్ 4: రాజమండ్రిలో మరోసారి పాలలో కల్తీ బయటపడింది. ఆహార పరిరక్షణ అధికారులు 190 పాల నమూనాలను సేకరించి లాబరేటరీలకు పంపించారు. అందులో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరోసారి ఇలాంటి కల్తీ బయటపడటం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
ఫిబ్రవరి 16న జరిగిన కల్తీ పాల ఘటనలో 20 మంది కిడ్నీ సంబంధిత అనూరియా వ్యాధికి గురైన విషయం తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాల కల్తీని అరికట్టడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఆహార కల్తీ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు చేస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి
Read Latest AP News And Telugu News