మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో కీలక పరిణామం
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:29 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) విచారణ మరో కీలక దశకు చేరుకుంది. సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ( YS Sunitha Reddy) సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు. సీబీఐ పూర్తిస్థాయిలో సమగ్రదర్యాప్తు చేయలేదని, ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రాలేదని అందువల్ల మరింత దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
నిందితులకు పిటిషన్ కాపీలు..
సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన కాపీలు ఈ కేసులోని నిందితులకు అందజేసినట్లు ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇది కేసులో పారదర్శకతకు ముఖ్యమైన అడుగని న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సీబీఐ ఇప్పటికే మూడు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగించింది. అయితే, సునీతారెడ్డి వాదన ప్రకారం ఇంకా పూర్తి నిజాలు బయటకు రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ కేసులో చైతన్యరెడ్డి, కిరణ్ యాదవ్ పాత్రపై క్లారిటీ..
సీబీఐ తన దర్యాప్తులో చైతన్యరెడ్డి, కిరణ్ యాదవ్‌లకు కేసుతో సంబంధం లేదని తేల్చినట్లు సమాచారం. దీంతో కేసులో కొన్ని అనుమానాలు తొలగినప్పటికీ, ఇంకా ప్రధాన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మే 4వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆ రోజున సునీతారెడ్డి పిటిషన్‌పై కీలక వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..
పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News