పులివెందులలో ఏసీబీ దాడుల కలకలం
ABN , Publish Date - Feb 23 , 2026 | 09:58 PM
కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.
కడప, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందులలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఇవాళ(సోమవారం) మెరుపు దాడులు నిర్వహించారు. పులివెందుల రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్, పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అధికారులు సీఐ వెంకటరమణ నివాసానికి సోదాల కోసం వెళ్తుండగా, అక్కడ ఉన్న హోంగార్డు ప్రసాద్ సీఐ ఇంట్లోని బంగారాన్ని తీసుకుని బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏసీబీ అధికారులు హోంగార్డును వెంబడించగా.. అతను బైక్‌ను అక్కడే వదిలేసి బంగారంతో సహా పరారయ్యాడు. ప్రస్తుతం అధికారుల బృందం అతని కోసం ముమ్మరంగా గాలిస్తోంది. సోదాలు జరగకుండా ఉండేందుకు సీఐ సతీమణి నివాసానికి తాళం వేసి వెళ్లిపోవడం గమనార్హం.
సీఐ, ఎస్ఐలపై ఏసీబీ నిఘా..
అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఐ, ఎస్ఐలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. సోమవారం సాయంత్రం ఏకకాలంలో వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని, సీఐ నివాసంలో సోదాలకు అధికారులు వెళ్లారు. బైక్‌ను వదిలేసి బంగారంతో హోంగార్డు ప్రసాద్ పారిపోయాడు. ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు వెంబడించారు. అయితే, పరారీలో ఉన్న హోంగార్డు ప్రసాద్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సీఐ నివాసం తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అవినీతి వ్యవహారంలో మరికొంత మంది పోలీసు అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారుల విచారణ జరుగుతోంది. పులివెందుల వంటి కీలక ప్రాంతంలో ఏసీబీ దాడులు జరగడం, పోలీసు అధికారులే సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..
Read Latest Telangana News And AP News And Telugu News