తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:06 PM
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సర్కార్‌కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
అమరావతి, జనవరి30 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సర్కార్‌కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సిట్ లేఖలో కీలక అంశాలు..
దర్యాప్తులో తేలిన ప్రాథమిక అంశాలను క్రోడీకరిస్తూ సిట్ బృందం ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఒక లేఖను సమర్పించింది. అందులో ప్రధానంగా ఈ కింది అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జగన్ హయాంలో తప్పిదాలు..
వైఎస్ జగన్ హయాంలో (2019 నుంచి 2024 వరకు) టీటీడీ పరిపాలనలో, ముఖ్యంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కొనుగోలు ప్రక్రియలో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ గుర్తించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత లోపించిందని, అందులో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని సిట్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
దిద్దుబాటు చర్యలు..
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి టీటీడీ అనుసరించాల్సిన కఠినమైన నిబంధనలు, నాణ్యత పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు చేసింది. సిట్ పంపిన సుదీర్ఘ లేఖను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే అధికారికంగా స్పందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం భావిస్తోంది.
వైసీపీ ప్రచారంపై ఆగ్రహం..
సిట్ దర్యాప్తులో ఏమీ తేలలేదని, క్లీన్ చిట్ ఇచ్చేసిందని వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ తప్పుడు ప్రచారాలు ఉన్నాయని ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భక్తుల విశ్వాసమే పరమావధి..
ఈ వివాదంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. తిరుమల పవిత్రతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ విషయంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని పేర్కొంది. టీటీడీ ప్రయోజనాలు, హిందూ ధర్మ పరిరక్షణే మా మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
నాపై దాడి ప్రయత్నం వెనుక బొత్స పాత్ర: పీలా శ్రీనివాసరావు
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News