మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:21 AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.
అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు (AP Minister Kandula Durgesh) మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఈ లేఖ వెలుగుచూడటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ లేఖ నిజంగా మావోయిస్టులే రాశారా? లేక మరేదైనా రాజకీయ కోణం ఉందా.? అనే దిశగా చర్చలు జోరందుకున్నాయి.
పీఎస్ ఫిర్యాదుతో పోలీసుల దృష్టి..
మంత్రి కందుల దుర్గేశ్ వ్యక్తిగత సహాయకుడు(PS) ఈ బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. లేఖలో ఉన్న విషయాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా లేఖ అసలు మూలం ఏమిటన్న విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
నిజంగా మావోయిస్టులేనా.?
ఈ లేఖ నిజంగా మావోయిస్టు సంస్థ తరఫున వచ్చిందా? లేక ఎవరైనా వారిపేరును ఉపయోగించి రాశారా.? అనే ప్రధానాంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మావోయిస్టుల నుంచి గతంలో వచ్చిన లేఖలతో సరిపోల్చి ప్రస్తుత లేఖను విశ్లేషిస్తున్నారు. భాష, పదజాలం వంటి తదితర అంశాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే ఈ లేఖలోని చేతిరాతపైనా విశ్లేషణ చేపట్టే అవకాశం ఉంది.
రాజకీయ కోణం ఉందా.?
ఈ విషయంలో మరో కోణంలోనూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎవరైనా ఈ లేఖ రాసి ఉంటారా? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఈ లేఖ బయటకు రావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి వచ్చిందా? లేక శాఖాపరమైన అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడ్డారా? అనే దిశగా కూడా విచారణ కొనసాగుతోంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ..
మంత్రి కందుల దుర్గేశ్‌కు వచ్చిన ఈ బెదిరింపు లేఖపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటెలిజెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర స్థాయిలో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. మంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నివాసం, కార్యాలయం, ప్రజా కార్యక్రమాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..