నా ఆమోదం లేకుండానే పిటిషన్లు
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:56 AM
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యంపై దాఖలుచేసిన హెబియస్ కార్పస్, సీబీఐ దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టును కోరారు.
న్యాయవాదే అనుబంధ పిటిషన్ వేశారు: సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యంపై దాఖలుచేసిన హెబియస్ కార్పస్, సీబీఐ దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టును కోరారు. తన ఆమోదం లేకుండానే న్యాయవాది అనుబంధ పిటిషన్ వేశారని... ఆ న్యాయవాదిని మార్చి, వాసుదీవుడు అనే న్యాయవాదిని నియమించుకొనేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె బుధవారం అనుబంధ పిటిషన్ వేశారు. పరిశీలించిన ధర్మాసనం న్యాయవాదిపై పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. ఈ నేపఽథ్యంలో ఆ న్యాయవాది వాదన సైతం వినాల్సిన అవసరం ఉందంది.
విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కాగా, సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సీఐ నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, దర్యాప్తు పురోగతిపై వివరాలు తమ ముందుంచాలని సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, పోలీసుల కస్టోడియల్ టార్చర్ కారణంగానే సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ వేశారు. కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా, సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద ఉంచామన్నారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News