ఈడీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:43 PM
ఈడీపై జగన్ నిందలు వేయడాన్ని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా తప్పబట్టారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలపై నిందలు వేయడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 12: ఈడీపై జగన్ నిందలు వేయడాన్ని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలపై నిందలు వేయడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
‘దేశంలో ఎక్కడాలేని విధంగా 31 క్రిమినల్, ఆర్థిక నేరాల కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌కు.. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి మచ్చలేని నిప్పులాంటి చంద్రబాబుపై మాట్లాడే నైతిక హక్కు లేదు. జగన్ తన దోపిడీ డైవర్షన్ కోసమే ఈడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కర్నూలులో గతంలో సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిన చరిత్ర జగన్ ముఠాది. ప్రపంచంలో ఎక్కడైనా.. ఒక ఆర్థిక నేరస్థుడు 14 ఏళ్లుగా బెయిల్‌పై తిరిగిన దాఖలాలు ఉన్నాయా? అక్రమ ఆస్తుల కేసుల్లో వాయిదాలు తీసుకుంటూ, డిశ్చార్జ్ పిటిషన్లతో విచారణను దశాబ్దాలుగా ఎందుకు సాగదీస్తున్నారు? రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావడానికి జగన్‌కు ఎందుకు భయం? వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరుకాకపోవడమే తన నేరాన్ని, దోపిడీని పరోక్షంగా అంగీకరించడం కాదా?’ అని ఎమ్మెల్యే నిలదీశారు.
‘గాలి జనార్దన్ రెడ్డితో కలిసి ఓబులాపురం మైనింగ్‌లో వేల కోట్ల సహజ సంపదను కొల్లగొట్టింది జగన్ కాదా? బాబాయ్‌ని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన నీచ రాజకీయాలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. జే-ట్యాక్స్ పేరుతో నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీసి వేల కోట్లు మూటగట్టుకున్న పాపం జగన్‌ది. అటువంటి చరిత్ర కలిగిన జగన్ ఈడీపై నిందలు వేయడమా? ఈడీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు జగన్ వెంటనే ప్రజలకు, దర్యాప్తు సంస్థలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈడీ, సీబీఐ సంస్థలు విచారణ వేగవంతం చేసి, జగన్ అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమానికి వినియోగించాలి’ అని ఎమ్మెల్యే ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం.. కిలో రూ.49కే బీపీటీ సన్నాలు
ఏపీలో 17 మేయర్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు
Read Latest AP News And Telugu News