Dharam Bir Gokul:విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు..
ABN , Publish Date - Jan 04 , 2026 | 02:09 PM
ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్‌లో సంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
గుంటూరు, జనవరి4(ఆంధ్రజ్యోతి):మారిషస్‌లో తెలుగు సాహిత్యం, భాషను ప్రోత్సహించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ (Mauritius President Dharam Bir Gokul) వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారిషస్ వచ్చినపుడు దేశంలో విద్య, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తోన్న సీఎం చంద్రబాబుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు ధరమ్ బీర్ గోకుల్.
తెలుగుపై ప్రభావం..
ఇంగ్లీష్ భాష ఎక్కువగా వినియోగించడంతో తెలుగు వంటి ప్రాచీన భాషపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో సగానికి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పూర్వికుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధిగా తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మక, విశిష్టమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు జిల్లాలో జరపడం అభినందనీయమని తెలిపారు. ఈ మహాసభల్లో తనకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా కొనసాగుతోన్నాయి. ఇవాళ(ఆదివారం) ఈ సభలో పాల్గొని ప్రసంగించారు ధరమ్ బీర్ గోకుల్.
ఇది ప్రతి దేశం బాధ్యత..
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ఉగాది పండుగను మారిషస్‌లో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. మారిషస్‌లో జాతీయ సెలవు దినంగా ప్రకటించి ఉగాది పండుగను చేసుకుంటున్నామని వెల్లడించారు. భాష, సంస్కృతి కాపాడటం ప్రతి దేశం బాధ్యత మాత్రమే కాదని.. అవసరం కూడా అని సూచించారు. అచెంచలమైన ప్రపంచానికి మార్గదర్శిగా తెలుగు భాషను అందించారని వివరించారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే మూడో భాషగా తెలుగు గుర్తింపు పొందిందని తెలిపారు. 50 దేశాల్లో తెలుగును ఎక్కువగా మాట్లాడుతుండటం భాషకు ఉన్న గొప్పదనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. తెలుగు తమ సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని తెలిపారు. ఇండియా, మారిషస్‌లను కలిపే సాంస్కృతిక బంధాలుగా తెలుగు ఉందని వివరించారు. ఈ మహాసభలు తెలుగు ప్రవాసాంధ్రులు, ఖండాల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేస్తుందని వెల్లడించారు ధరమ్ బీర్ గోకుల్.
జాతీయ ఐక్యత పెరిగింది..
‘మహాసభలను ఘనంగా నిర్వహిస్తూ తెలుగుపై చూపుతోన్న అంకిత భావానికి ఆంధ్ర సారస్వత పరిషత్‌ను అభినందిస్తున్నా. ఈ మహాసభల్లో జరిగిన చర్చలు, ఫలితాలు ప్రపంచంలో తెలుగు గుర్తింపును బలపరుస్తాయి. భారత్, మారిషస్ దేశాలు పరస్పరం అసాధారణ నాగరికత అనుబంధం కలిగి ఉన్నాయి. భారత్, మారిషస్ దేశాలు సాంకేతిక అభివృద్ధిలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య వైవిధ్యాన్ని పెంపొందిస్తే జాతీయ ఐక్యతను, పరస్పర అవగాహనను పెంపొందింపజేస్తాయి. మారిషస్ జాతీయ నిర్మాణంలో మారిషస్‌లోని తెలుగు సమాజం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది’ అని వ్యాఖ్యానించారు ధరమ్ బీర్ గోకుల్.
ఆర్థిక అభివృద్ధిలో కీలకమార్పు..
‘మారిషస్ దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలకమార్పు తీసుకురావడంలో తెలుగు సమాజం ఎంతో పాటుపడుతోంది. మారిషస్‌లో తెలుగు భాషను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ భాషగా గుర్తించి విద్యాలయాల్లో బోధిస్తున్నాం. ఏపీ నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్‌లో సాంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారు. తెలుగు భాష విద్య సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహంతో ఆలయం మారిషస్‌లో ఉంది. మహత్తరమైన వేంకటేశ్వరస్వామి విగ్రహం ఆధ్యాత్మిక, భౌగోళికంగా ,భిన్న ఖండాల భక్తులను ఏకం చేస్తోంది’ అని సూచించారు ధరమ్ బీర్ గోకుల్.
ఈ వార్తలు కూడా చదవండి...
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ
Read Latest AP News And Telugu News