అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి హోంమంత్రి ఆదేశాలు
ABN , Publish Date - May 12 , 2026 | 06:19 PM
అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్‌స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) సచివాలయంలో ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్‌స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్‌స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు.
ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి..
విశాఖపట్నం పశ్చిమ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రీల భాగస్వామ్యంతో ఫైర్‌స్టేషన్లను ప్రతిపాదించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అగ్నిమాపక శాఖలో 1,275 ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలని ఆదేశించారు. జాబ్ క్యాలెండర్‌లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫైర్ సిబ్బంది స్పందన సమయాన్ని 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించాలని మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమల సహకారంతో ఫైర్ అవుట్‌పోస్టుల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఫైర్ టెండర్ల వినియోగంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. సెజ్ ప్రాంతాల్లో సమష్టి ఫైర్‌స్టేషన్ల ఏర్పాటుపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. పరిశ్రమల్లో ఫైర్‌సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు.
ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయాలి..
లైసెన్స్ పొడిగింపులకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు తప్పనిసరి చేయాలని హోంమంత్రి అనిత సూచించారు. అడవిలో అగ్నిప్రమాదాల నియంత్రణలో డ్రోన్ల వినియోగంపై దృష్టిసారించాలని ఆదేశించారు. వ్యర్థాలపై సరైన వర్గీకరణ లేకపోవడంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్లలో ఫైర్‌సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ‘ఆపద మిత్ర’ తరహాలో యువతకు స్వచ్ఛంద సేవా శిక్షణను విస్తరించాలని సూచించారు. సింగపూర్, స్విట్జర్లాండ్ విపత్తు నిర్వహణ విధానాలపై అధ్యయనం చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఛత్తీస్‌గఢ్, చండీగఢ్ నమూనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అగ్నిమాపక అత్యవసర సేవలను 112 సేవలతో సమన్వయం చేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై
అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News