ఎర్ర బంగారం.. ‘సూపర్ 10 డీలక్స్’ నాటు మిర్చి క్వింటా రూ.32 వేలకు బిడ్డింగ్
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:07 AM
ఆ రైతు పొలంలో ఎర్ర బంగారం పండింది. ధర కూడా నషాళాన్ని అంటేలా ఉంది. ఎగుమతిదారులు ఆ టాప్ క్వాలిటీ మిర్చికి క్వింటాకు రూ.32 వేలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ధీమాతో ఆ రైతు విక్రయించడానికి అంగీకరించలేదు.
మరింత ధర వస్తుందని కాటాలు నిలిపివేసిన రైతు అమర్నాథ్
క్వింటాకు రూ.40 వేలు వస్తుందని ధీమా
నాలుగెకరాల్లో సాగు.. 80 క్వింటాళ్ల దిగుబడి
గుంటూరు: ఆ రైతు పొలంలో ఎర్ర బంగారం పండింది. ధర కూడా నషాళాన్ని అంటేలా ఉంది. ఎగుమతిదారులు ఆ టాప్ క్వాలిటీ మిర్చికి క్వింటాకు రూ.32 వేలు ఇస్తామని ముందుకొచ్చారు. అయితే ఇంకా ఎక్కువ ధర వస్తుందన్న ధీమాతో ఆ రైతు విక్రయించడానికి అంగీకరించలేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో రైతు చిట్టినేని అమర్నాథ్ టాప్ క్వాలిటీ సూపర్ 10 డీలక్స్ (నాటు రకం) మిర్చిని నాలుగెకరాల్లో సాగు చేశాడు. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున.. 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో తొలి కాపు రాగా.. అప్పట్లో ధర అంతంత మాత్రంగా ఉండడంతో గుంటూరు కోల్డ్‌స్టోరేజ్‌లో తన పంట నిల్వ చేశాడు.
గత రెండు నెలలుగా గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(మిర్చియార్డు)లో మిర్చి ధరలు నిలకడగా ఉంటున్నాయి. దీంతో కోల్డ్‌స్టోరేజ్‌లో నిల్వ చేసిన తన పంటను విక్రయించేందుకు అమర్నాథ్ మూడు లాట్ల శాంపిల్స్‌ను మంగళవారం యార్డులోని శ్రీ కృష్ణవేణి చిల్లీస్ దిగుమతి షాపు వద్దకు తీసుకొచ్చారు. ఎర్రగా నిగనిగలాడుతున్న ఆ టాప్ క్వాలిటీ మిరపకాయలను చూసి ఎగుమతిదారులు ఆశ్చర్యపోయారు. దాంతో చాలామంది ఆ మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపించారు.
గత కొద్ది రోజులుగా ఈ రకం మిర్చి క్వింటా ధర రూ.25 వేల వరకే ఉంటోంది. అలాంటిది వ్యాపారుల పోటీ కారణంగా రికార్డు స్థాయిలో రూ.32 వేలకు బిడ్డింగ్ జరిగింది. అయితే ఇంకా ఎక్కువ(క్వింటాకు రూ.40 వేలు) ధర ఆశిస్తున్న అమర్నాథ్.. ఈ-నామ్‌లో ఎక్కువ మొత్తానికి బిడ్డింగ్ వేసిన సంస్థకు మిర్చి అమ్మేందుకు నిరాకరించాడు. దాంతో యార్డులో మూడు లాట్ల మిర్చి(100 టిక్కీలు) తూకం వేయకుండానే ఆగిపోయింది. సాధారణంగా వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ధర నిర్ణయం జరుగుతుంటుంది. అందుకు పూర్తి భిన్నంగా మంగళవారం రైతు అమర్నాథ్ తన దిగుబడికి ధర నిర్ణయించాడు.
క్వాలిటీ దెబ్బతినకుండా సాగు..
నిజానికి అమర్నాథ్ ఎంతో శ్రద్ధతో మిర్చి సాగు చేశాడు. పంటకు తెగులు సోకినా తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి క్వాలిటీ దెబ్బతినకుండా సీజన్‌లో పంటను కాపాడుకోవడం వల్లే రికార్డు స్థాయిలో ధర పెంచగలిగాడు. ఈ నేపథ్యంలో మిర్చి సాగు చేసే రైతులు టాప్ క్వాలిటీ దిగుబడులపై దృష్టి సారిస్తే కచ్చితంగా మిర్చి మార్కెట్‌ను శాసిస్తారని గుంటూరు ఏఎంసీ వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News