Share News

గొప్ప దార్శనికుడు.. జైపాల్‌రెడ్డి

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:47 AM

గొప్ప దార్శనికుడు జైపాల్‌రెడ్డి అని, తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిదని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నెక్లెస్‌ రోడ్డులోని స్ఫూర్తిస్థల్‌లో..

గొప్ప దార్శనికుడు.. జైపాల్‌రెడ్డి

  • రాష్ట్ర సాధనలో ఆయన కృషి భేష్‌: స్పీకర్‌ ప్రసాద్‌

  • నివాళులర్పించిన కోమటిరెడ్డి, పొన్నం, దుద్దిళ్ల

  • శ్రద్ధాంజలి ఘటించిన సీఎం సతీమణి గీతారెడ్డి

రాంగోపాల్‌పేట్‌ (ఆంధ్రజ్యోతి): గొప్ప దార్శనికుడు జైపాల్‌రెడ్డి అని, తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిదని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం నెక్లెస్‌ రోడ్డులోని స్ఫూర్తిస్థల్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి సేవలు, ఆయన మార్గం అనితర సాధ్యమని కొనియాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అజాత శత్రువు అయిన జైపాల్‌రెడ్డి తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు పొందడం గర్వకారణమన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజా సేవకు నిలువెత్తు సాక్ష్యం జైపాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. లోక్‌సభలో ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలు.. తమకు ఆదర్శమన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి సైతం స్పూర్తి స్థల్‌ను సందర్శించి, జైపాల్‌రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. జైపాల్‌ రెడ్డికి నివాళులర్పించిన వారిలో బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారులు వీహెచ్‌, సుదర్శన్‌రెడ్డి, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, గాందీభవన్‌లోనూ పలువురు కాంగ్రెస్‌ నేతలు జైపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Jul 29 , 2026 | 07:47 AM