హైడ్రా.. రేవంత్ వేట కుక్క
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:51 AM
హైడ్రా.. సీఎం రేవంత్ రెడ్డికి వేటకుక్కలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా అనే వేట కుక్కను పంపించి, పెద్దఎత్తున డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బుల్లో రాహుల్ గాంధీతోపాటు బీజేపీ వాళ్లకు వాటాలు ఇస్తున్నారని ఆరోపించారు.
వసూళ్లలో రాహుల్, బీజేపీకి వాటా
రేవంత్ అన్నదమ్ములే పెద్ద కబ్జాకోరులు
దమ్ముంటే పొంగులేటి, వివేక్ ఇళ్లు కూల్చండి: కేటీఆర్
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): హైడ్రా.. సీఎం రేవంత్ రెడ్డికి వేటకుక్కలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా అనే వేట కుక్కను పంపించి, పెద్దఎత్తున డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బుల్లో రాహుల్ గాంధీతోపాటు బీజేపీ వాళ్లకు వాటాలు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, జాన్సన్ నాయక్‌లతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని స్వయంగా హైకోర్టే చెప్పింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? బడా బాబులను వదిలిపెట్టి, గరీబోళ్ల ఇళ్లపై పడటాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. హైడ్రా అనేది నిజంగా రేవంత్ చెప్పినట్టు సంస్కరణ అయితే, ముందు ఆయన అన్న తిరుపతిరెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదు. ఆయన అన్నకు హైకోర్టు స్టే ఉందని చెప్తారు, అదే హైకోర్టు స్టే ఉన్న వేరే వాళ్ల ఇళ్లు మాత్రం అన్యాయంగా కూల్చేస్తారా? ‘హైడ్రా’పై 65 సార్లు హైకోర్టు చెప్పినా సీఎం వినడా? ముందు.. మీ అన్న తిరుపతి రెడ్డి కబ్జాలో ఉన్న శిఖం భూమి, బిల్డింగ్‌ను కూలగొట్టమనండి.
రేవంత్ రెడ్డి కొడంగల్, రెడ్డికుంటలో కట్టిన ఇళ్లు, మంత్రులు వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఎఫ్టీఎల్‌లో కట్టిన ఇళ్లను కూల్చమని చెప్పండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు’’ అని కేటీఆర్ అన్నారు. హైకోర్టు చెప్పి 24 గంటలైందని, ఇంకా రంగనాథ్‌ను కొనసాగించడం.. ముమ్మాటికీ న్యాయస్థానాన్ని అగౌరవ పరచడమేనని అన్నారు. రేవంత్ అన్నదమ్ముల కంటే అతిపెద్ద కబ్జాకోరులు ఇంకెవరూ లేరని చెప్పారు. దాదాపుగా 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి దానిని కోటి ఎకరాలకు చేర్చారని, అందరినీ పిలిచి 30ు బేరాలు ఆడుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. కాజీపేట రైల్వే డివిజన్ కలను సాకారం చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేటీఆర్ కోరారు. మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
రేవంత్ రహస్య మిత్రులంతా బీజేపీ వాళ్లే...
రేవంత్, కేటీఆర్ ఒకేసారి ఢిల్లీలో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రహస్య మిత్రులు అందరూ బీజేపీ వాళ్లేనని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్ట్ చేయకుండా కాపాడింది రేవంత్ కాదా? అని ప్రశ్నించారు. అమృత్ పథకంలో రేవంత్ రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది కేంద్రమేనని ఆరోపించారు. సృజన్ రెడ్డి నాయకత్వంలో సింగరేణిలో కుంభకోణం జరిగితే తాము ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. పొంగులేటి ఇంటిపై దాడులు జరిగి రెండేళ్లయినా ఇప్పటికీ దాని ఊసే లేదన్నారు. ఇవన్నీ చూస్తే ఎవరు ఎవరికి రహస్య మిత్రులో అర్థమవుతోందని తెలిపారు.