Share News

పంటంతా అమ్ముకున్నాక... భారీగా పెరిగిన పత్తి ధర

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:57 AM

పత్తికి డిమాండ్‌ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది.

పంటంతా అమ్ముకున్నాక...  భారీగా పెరిగిన పత్తి ధర

  • నాడు క్వింటాకు రూ.6 వేలూ రాలేదు

  • నేడు రూ.10 వేలు దాటిన ధర

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పత్తికి డిమాండ్‌ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది. దాదాపు ఏడాది పొడవునా పత్తి క్రయవిక్రయాలు జరిగే ఆదోని మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాకు రూ.10వేలుపైనే లభిస్తోంది. తాజాగా క్వింటా పత్తి రూ.10,350 పలికింది. ఈ నెల ఒకటో తేదీన రూ.9,830 పలికిన ధర.. పది రోజుల్లో రూ.500దాకా పెరిగింది. మార్చి నెలలో కనీస మద్దతు ధర కూడా లేకపోగా.. ఇప్పుడు డిమాండ్‌ వచ్చింది. గతేడాది పత్తికి డిమాండ్‌ ఉన్నా.. ఉత్పత్తి లేకపోవడం, తుఫాన్ల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తిని రైతులు నిల్వ ఉంచుకోలేక, వచ్చిన ధరకు అమ్మేశారు. ఇప్పుడు సీజన్‌ ముగిసిపోయి, పత్తి నిల్వలు తరిగిపోయిన తర్వాత మంచి ధర వస్తోంది.


రాష్ట్రంలో 2025-26 మార్కెటింగ్‌ సీజన్‌లో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో పత్తి పండించగా, దాదాపు 8 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయ్యింది. పత్తి క్వింటా కనీస మద్దతు రూ.7,710-8,110 ఉండగా, 38,940 మంది రైతుల నుంచి రూ.1,556.93కోట్ల విలువైన 19,99లక్షల క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేసిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. అయితే గతేడాది పత్తి తీసే తరుణంలో మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసి, పత్తి తడిసి, పాడైపోయి రైతులు భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాకు రూ.6వేలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు కొంత పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు. సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో బయట ధరలు ఎమ్మెస్పీ కన్నా తక్కువగా ఉన్నా.. రైతులు వచ్చిన ధరకు ప్రైవేట్‌ వ్యాపారులకు పంట అమ్ముకున్నారు. చివరిలో ఆరుదల పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకున్నారు. సీజన్‌ ముగిశాక.. నాణ్యమైన పత్తిని నిల్వ ఉంచుకున్న వ్యాపారులు ఇప్పుడు అధిక ధరకు అమ్మి, సొమ్ముకుంటున్నారు. కాగా, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో వేసవిలోనూ కొంతమేర పండించే పత్తిని ఇప్పుడు ఆదోని మార్కెట్‌లో రైతులు మంచి ధరకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు ఆరేడు వందల క్వింటాళ్ల పత్తి వస్తోంది.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 07:57 AM