అమరావతిలో బాలీవుడ్ నటుల సందడి: సీఎంతో సంజయ్ దత్ భేటీ..
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:24 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఏపీలో భారీ సినీ ప్రాజెక్టులకు పునాది పడబోతుందనే సంకేతాలను ఇస్తోంది.
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) విజన్, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు అమరావతికి తరలిరావడం చూస్తుంటే, అతి త్వరలోనే ఏపీలో భారీ సినీ స్టూడియోలు లేదా అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు (మంగళవారం) గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సంజయ్ దత్ బృందం నేరుగా వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. గత ఫిబ్రవరిలో ముంబై వేదికగా మంత్రి నారా లోకేశ్‌తో జరిగిన చర్చల కొనసాగింపుగానే ఈ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది.
సీఎంతో సంజయ్ దత్ బృందం భేటీ..
సంజయ్ దత్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు కీలక ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. గౌరవ్ దూబే (Gaurav Dubey, కునాల్ పటేల్ (Kunal Patel), అనుజ్ కుమార్ (Anuj Kumar) వీరిలో ఉన్నారు.
ఏపీలో ఫిలిం సిటీ ఏర్పాటుపై చర్చ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒక భారీ ఫిలిం సిటీ లేదా సినిమా హబ్ అవసరం ఎంతైనా ఉంది. గతంలో లోకేశ్‌తో జరిగిన భేటీలో సంజయ్ దత్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఈ ఫిలిం సిటీని అమరావతి పరిసరాల్లో లేదా విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
సింగిల్ విండో అనుమతులు..
సినిమా షూటింగ్‌ల కోసం ఏపీని ఒక గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సంజయ్ దత్ బృందానికి వివరించినట్లు తెలుస్తోంది. ఏపీలో సినిమా ఇండస్ట్రీకి అవసరమైన లొకేషన్లు పుష్కలంగా ఉన్నాయి. సంజయ్ దత్ వంటి అగ్ర నటులు ఇక్కడ స్టూడియోలు లేదా ఫిలిం సిటీలను నిర్మిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. బాలీవుడ్, సౌత్ సినిమాల కలయికతో ఏపీ సినీ హబ్‌గా మారుతుందని ప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News