శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 08:56 PM
శ్రీకాకుళం నగరంలో డయేరియా (అతిసారం) ప్రబలడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు. ఈ ఘటనపై ఆయన జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించి, బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు.
అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు నమోదు కావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ (DMHO), నగరపాలక సంస్థ కమిషనర్‌తో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి తాజా పరిస్థితిని సమీక్షించారు. డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణాలు ఏంటి? కలుషిత నీరా లేదా ఇతర ఆహారపు అలవాట్లా? అనే కోణంలో తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
మెరుగైన వైద్యం అందించాలి..
వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సాయం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వ్యాధి మరింత విస్తరించకుండా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని, తాగునీటి నాణ్యతను తనిఖీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
అధికారుల సూచనలు..
తాగునీటిని కాచి, వడపోసి చల్లార్చిన తర్వాతే తాగాలని అధికారులు సూచించారు. ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలని, బయటి ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..
Read Latest Telangana News And AP News And Telugu News