34శాతంపై ముందుకే!
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:45 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది.
బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే.. స్పష్టంచేసిన సీఎం
మంత్రులతో సుదీర్ఘ చర్చలు, నిర్ణయం
పంచాయతీరాజ్‌లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో మూడో వంతు బీసీలకు
నేడు క్యాబినెట్‌లో ఆమోదం.. ఆపై జీవో జారీ
పంచాయతీరాజ్ యాక్ట్‌లోనే ఆ వెసులుబాటు
ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలో స్థానిక ఎన్నికలు
అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించనుంది. ఆ తర్వాత... జీవో జారీ చేసి, దీనిని అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్... రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.6 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. అలాగే... స్థానిక ఎన్నికల్లో బీసీలకు 27శాతం వాటా ఇవ్వాలని సిఫారసు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించితే న్యాయపరంగా చెల్లుబాటు కాదు. దీనిని దృష్టిలో పెట్టుకునే 27 శాతానికి పరిమితం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కోటాతో పోల్చితే ఇది ఎక్కువే. అయినప్పటికీ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం బీసీలకు కేటాయించి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్‌లో... రాత్రి మరోసారి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలురకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. చివరికి... 34 శాతంపై ముందుకే వెళ్లాలని తీర్మానించారు. డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పినప్పటికీ... బీసీలకు 34 శాతానికి మించకుండా రిజర్వేషన్ కల్పించవచ్చునని పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. అందువల్ల ప్రత్యేకంగా చట్టం కూడా చేయనక్కర్లేదు. దీనిపై జీవో జారీ చేస్తే సరిపోతుంది. ‘‘బీసీలకు 34శాతం కోటా కల్పించే అవకాశమున్నా జగన్ ఆ పని చేయలేదు. మనం అలా చేయొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం... పంచాయతీరాజ్ యాక్ట్‌లో ఉన్న వెసులుబాటు ప్రకారమే బీసీలకు 34 శాతం సీట్లు ఇద్దాం’’ అని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో 34 శాతం.. పట్టణ స్థానిక సంస్థల్లో మూడోవంతు బీసీలకు కేటాయిస్తూ మంగళవారం క్యాబినెట్‌లో తీర్మానం ఆమోదిస్తారు. ఆ మేరకు కొత్తగా జీవో జారీ చేస్తారు.
రకరకాల చర్చలు..:
డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను యథాతథంగా అమలు చేస్తే బీసీలకు న్యాయం చేయలేమని మంత్రుల భేటీలో పలువురు పేర్కొన్నారు. అలాగని డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కాదని 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ఇస్తే న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, పర్యవసానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే అవాంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారు. ‘‘ఎన్నికల సమయంలో బీసీలను రాజకీయంగా మరింత ఉన్నత స్థానంలో ఉంచేందుకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానిని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చుకుంటాం’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో చట్టపరంగా అవాంతరాలు రాకుండా చూసుకోవలసి ఉందన్నారు. ఈ క్రమంలో... పంచాయతీరాజ్ చట్టంలోనే ఆ వెసులుబాటు ఉందని తేలింది. జీవో జారీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినప్పటికీ... దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయించి, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తే ‘ప్లాన్-బీ’ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అదేమిటంటే... డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూనే, పార్టీ పరంగా బీసీలుకు 34 శాతం సీట్లు కేటాయిస్తారు.
సకాలంలో ఎన్నికలు తథ్యం...
ఏది ఏమైనా గడువులోపే స్థానిక ఎన్నికలను నిర్వహించి తీరాలని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పారు. జాప్యం జరిగితే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి అందే నిధులకు గండి పడే ప్రమాదముంది. అక్టోబరు 3న ‘సర్’ తుది జాబితా వస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికలకు వెళ్లకపోతే కొత్త జాబితాలతో వెళ్లాల్సి ఉంటుందని, ఇది మరింత జాప్యానికి దారి తీస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు కావలసిందేనని సీఎం తేల్చిచెప్పారు.
‘ప్రత్యక్ష’ పోరు బిల్లు రేపే
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల చైర్‌పర్సన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ ముసాయిదా బిల్లుపై మంగళవారం క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీనిని బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందితే... మునిసిపల్ చైర్‌పర్సన్, కార్పొరేషన్ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకొంటారు.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News