Share News

రూ.15 కోట్ల క్రిప్టో స్కాం మోసాన్ని ఛేదించిన ఏపీ సీఐడీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:51 PM

భారీ అంతర్జాతీయ వ్యవస్థీకృత క్రిప్టోకరెన్సీ మోసాన్ని రాష్ట్ర సీఐడీ పోలీసులు ఛేదించారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. క్రిప్టో పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి, అమాయకులతో కోట్ల రూపాయలలో పెట్టుబడులు పెట్టించారని తెలిపారు.

రూ.15 కోట్ల క్రిప్టో స్కాం మోసాన్ని ఛేదించిన ఏపీ సీఐడీ
AP DGP Harish Kumar Gupta

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): భారీ అంతర్జాతీయ వ్యవస్థీకృత క్రిప్టోకరెన్సీ మోసాన్ని రాష్ట్ర సీఐడీ పోలీసులు ఛేదించారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) పేర్కొన్నారు. క్రిప్టో పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి, అమాయకులతో కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టించారని తెలిపారు. మోసపూరిత పద్ధతుల్లో నిధులను అంతర్జాతీయ క్రిప్టో ప్లాట్‌ఫాంలకు మళ్లించి మోసం చేసే ముఠాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.


ఈ అకౌంట్‌లను స్తంభింపచేసి, నిధులను వారి ఖాతాల నుంచి భాధితురాలి ఖాతాకు తరలించేలా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని డీజీపీ వెల్లడించారు. ఏపీ సీఐడీ తొలిసారిగా సుమారు USD 1.5 మిలియన్లు (దాదాపు రూ.15 కోట్ల) విలువైన భారీ అంతర్జాతీయ వ్యవస్థీకృత క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసాన్ని విజయవంతంగా ఛేదించిందని అన్నారు. 2025లో తెనాలికి చెందిన బాధితురాలిని నకిలీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభ పెట్టారని తెలిపారు. బాధితుల నుంచి కాజేసిన నిధులను పలు అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజి ఖాతాలకు మళ్లించినట్లు ఏపీ సీఐడీ గుర్తించిందని చెప్పారు.


సీఐడీ అధికారుల సమగ్ర దర్యాప్తుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో ఖాతాలు, క్రిప్టో ఆస్తులను గుర్తించి, అంతర్జాతీయ మోసపూరిత నెట్‌వర్క్‌కు కీలకమైన ఆర్థిక సంబంధాలను వెలికితీశారని డీజీపీ తెలిపారు. ఈ కేసులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు, సంబంధిత న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేశారని చెప్పారు. అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంల ద్వారా మళ్లించిన బాధితురాలి రూ.15 కోట్లను సీఐడీ అధికారులు గుర్తించారని అన్నారు. తిరిగి రూ.15 కోట్ల క్రిప్టో ఆస్తులను ఆమె ఖాతాకు జమ చేశారని తెలిపారు. ఏపీ సీఐడీ టీంలో కీలకంగా పని చేసిన వారికి నజరానాలు ప్రకటిస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 06:48 PM